అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Income Tax Rules | ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను ఏప్రిల్ ఒకటో తేదీనుంచి అమలులోకి తెచ్చింది. ఉద్యోగి వస్తు రూపంలో పొందే ప్రయోజనాల విలువను దీనిలో సవరించింది. దీని ప్రకారం ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే కారు, డ్రైవర్, ఇతర విలాసవంతమైన సదుపాయాలపై పన్ను భారం పెరగనుంది. అంటే సదరు ఉద్యోగి ఆదాయం ఏమాత్రం పెరగకపోయినా ట్యాక్సబుల్ ఇన్‌కమ్ (Taxable Income) మాత్రం పెరగనుంది.
ఇది వారి టేక్ హోమ్ శాలరీ (Take-home salary)పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వం ఈ మార్పుల ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. విలాసవంతమైన కార్పొరేట్ జీవనశైలి కావాలంటే పూర్తి మార్కెట్ ధర చెల్లించి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే మీల్ వోచర్లు, గిఫ్ట్ వోచర్ల విషయంలో మాత్రం ఊరట లభించనుంది. మొత్తానికి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త ఆదాయపు చట్టం ఇన్ హ్యాండ్ శాలరీపై మరియు ఖర్చులపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు.
New Income Tax Rules | కంపెనీ కారు.. భారమే!
కొత్త ఆదాయపు పన్ను(New Income Tax) నిబంధనల ప్రకారం కంపెనీ కారు వాడుతున్న వారికి ఇబ్బందే. 1.6 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం ఉన్న కారును ఆఫీస్, వ్యక్తిగత అవసరాలకోసం వాడుతుంటే.. దాని పన్ను విలువను రూ. 1,800 నుంచి రూ. 5 వేలకు పెంచారు. అంటే నెలకు అదనంగా రూ. 3,200 ఆదాయానికి కలిసినట్లు లెక్కగడతారు. అదే 1.8 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఎస్‌యూవీ వాడుతూ, డ్రైవర్‌ను కూడా కలిగి ఉంటే.. సదరు ఉద్యోగి ట్యాక్సబుల్ ఇన్‌కమ్ నెలకు రూ. 10 వేల వరకు పెరగనుంది.
New Income Tax Rules | వోచర్ల విషయంలో ఊరట..
కొత్త పన్ను నిబంధనల్లో ఉద్యోగులకు కొన్ని సానుకూల విషయాలూ ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మీల్ వోచర్ల పరిమితిని పెంచారు. ఇప్పటివరకు ఒక్కో పూటకు రూ. 50 గా ఉన్న పరిమితిని రూ. 200 లకు పెంచారు. గిఫ్ట్ వోచర్ల పరిమితి రూ. 15 వేలకు పెంచడం కూడా ఉద్యోగులకు కలిసొచ్చే అంశమే. అలాగే కంపెనీ నుంచి తీసుకునే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచడం గమనార్హం. ఇది అత్యవసరాల కోసం చిన్న మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునే ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశం.
New Income Tax Rules | హెచ్ఆర్ఏ.. బెనిఫిట్..
ఇప్పటివరకు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై వాసులకు మాత్రమే 50 శాతం హెచ్ఆర్ఏ మినహాయింపు ఉండేది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె నగరాలనూ ఈ జాబితాలో చేర్చారు. దీనివల్ల ఆయా నగరాల్లో నివసించే ఐటీ, ఇతర రంగాల ఉద్యోగుల పన్ను భారం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.
పిల్లల చదువులకు..
పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ మినహాయింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరు నెలకు కేవలం రూ. 100 గా ఉన్న మినహాయింపును ఏకంగా రూ. 3 వేలకు పెంచడం గమనార్హం.
విదేశీ ప్రయాణాలకు..
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి తీపి కబురు అందించింది. ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ ను 20 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల విదేశీ ప్రయాణాలు చేసేవారికి ముందస్తుగా చెల్లించాల్సిన సొమ్ము తగ్గుతుంది.
ఇది కూడా చదవండి..: Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్’.. ఉత్త ఫేక్ న్యూస్
