అక్షరటుడే, ఇందూరు: Nizamabad Chain Snatching | బంగారం ధర ఆకాశాన్ని అంటింటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరగడంతో మరోవైపు దొంగలు సైతం రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే కాదు.. వెంట తోడుగా ఎవరు ఉన్నా వదలడం లేదు.. బైక్‌పై వచ్చి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాజాగా మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో గురువారం (మార్చి 12) రాత్రి చైన్ స్నాచర్లు తెగబడ్డారు.
Nizamabad Chain Snatching | రెండు తులాల పుస్తెలతాడు..
ఎస్‌హెచ్‌వో రఘుపతి కథనం ప్రకారం.. సిరికొండకు చెందిన పద్మ – సంతోష్ రెడ్డి అనే భార్యాభర్తలు ఖలీల్వాడిలోని ఓ హాస్పిటల్లో పేషంట్‌ను మాట్లాడించడానికి వచ్చారు. అనంతరం టీ స్టాల్లో ఛాయ్ తాగి లక్ష్మారెడ్డి హాస్పిటల్ ముందున్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. భర్త ఎదురుగానే భార్య మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా తెంపుకొని, చూస్తుండగానే ట్రాఫిక్‌లో కలిసిపోయారు.
Nizamabad Chain Snatching | పోలీసుల సూచనలు..
బాధితుల ఫిర్యాదు మేరకు ఒకటో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో రఘుపతి మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో విలువైన ఆభరణాలు ఒంటిపై వేసుకోకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ముఖ్యంగా మహిళలు విలువైన ఆభరణాలను ఒంటిపై వేసుకుని, ఒంటరిగా బయటకు వెళ్లొద్దన్నారు. విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని ప్రజలకు సూచించారు.

