అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Congress Leader Murder | నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురయ్యాడు. ఇమ్మడి గోపి బుధవారం (మార్చి 11) రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా.. ఇందల్వాయి శివారులో ఒకడు మరో కారుతో ఢీ కొట్టాడు. అనంతరం అత్యంత దారుణంగా హతమార్చాడు.
Nizamabad Congress Leader Murder | లొంగిపోయిన నిందితుడు
ఇమ్మడి గోపీని హతమార్చిన నిందితుడు తర్వాత ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విషయం తెలిసి వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పరసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇందల్వాయి మండలానికి చెందిన ఇమ్మడి గోపి గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో సేవలు అందించారు. అలాగే ఇందల్వాయి మండలంలో ఎంపీపీగానూ సేవలు అందించారు. ముదిరాజ్ సంఘంలోనూ క్రీయాశీలక పాత్ర పోషించారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం నిర్విర్తించేవారు. ఈయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచిగా గెలిచి బాధ్యతలు చేపట్టారు.
Nizamabad Congress Leader Murder | హతమార్చింది సమీప బంధువే..
కాగా, ఇమ్మడి గోపీని హతమార్చింది సమీప బంధువు, వరుసకు మేనల్లుడైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు తనంతట తాను పోలీసులకు లొంగిపోగా.. ఇందుకు గల కారణాలపై వారు విచారణ కొనసాగిస్తున్నారు. మండలంలో అంచెలంచెలుగా ఎదిగిన అధికార పార్టీకి చెందిన కీలక బీసీ నేత గోపీ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

