అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ola Electric Sales Growth | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి సంచలనంగా వచ్చిన ఓలా(Ola).. ప్రారంభంలో ప్రజల ఆదరణను పొందింది. ఒకప్పుడు మొత్తం ఈవీ స్కూటర్ల మార్కెట్‌లో ఆధిపత్యం ఈ కంపెనీదే.. అయితే కంపెనీ స్కూటర్లు తరచూ మరమ్మతులకు గురవడం, సర్వీసింగ్‌లో నిర్లక్ష్యం, విడిభాగాలు లభ్యం కాకపోవడం వంటి కారణాలతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంపెనీ మార్కెట్ షేర్ తగ్గుతూ వచ్చింది.
ఇదే సమయంలో ప్రధాన ద్విచక్ర వాహన కంపెనీలూ ఈవీపై దృష్టి సారించడం, వాటి బలమైన నెట్‌వర్క్, సర్వీసింగ్ సేవల నాణ్యత కారణంగా అవి ప్రజాదరణ పొందాయి. దీంతో ఒకప్పుడు దేశంలో ఈవీ స్కూటర్ల (EV Scooters) అమ్మకాలలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఓలా.. క్రమంగా తన స్థానాన్ని కోల్పోతూ టాప్ టెన్ జాబితాలో స్థానాన్ని కోల్పోయింది.
Ola Electric Sales Growth | గతనెలలో పుంజుకున్న అమ్మకాలు..
మార్చి నెలలో ఓలా అమ్మకాలు పెరిగాయి. 10,117 రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు వాహన్ డేటా ప్రకారం తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ల (Ola Electric Registrations) సంఖ్య 3,973 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రెండున్నర రెట్లు వృద్ధి నమోదు కావడం గమనార్హం. మార్చి నెల చివరి వారంలో రోజుకు సగటున వెయ్యి యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. సర్వీసు సెంటర్లను విస్తరించడం, పనితీరును మెరుగుపరచుకోవడం, సర్వీసింగ్‌కు వచ్చే వాహనాల్లో దాదాపు 80 శాతం అదే రోజు పూర్తి చేసి ఇవ్వడంతో కస్టమర్ల ఆదరణ పెరిగినట్లు చెబుతోంది. ఈ రికవరీ మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.
Ola Electric Sales Growth | మిలియన్ యూనిట్ల అమ్మకాల రికార్డ్..
ఈ క్రమంలో భారతదేశంలో మొత్తం 10 లక్షల క్యుములేటివ్ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటిన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ (Electric vehicle) బ్రాండ్‌గా ఓలా రికార్డు సృష్టించింది.
మొత్తంగా 1 మిలియన్ విక్రయాలు సాధించిన తొలి ఈవీ కంపెనీగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇదే పనితీరును భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
Ola Electric Sales Growth | భారీగా పెరిగిన షేరు ధర
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో వృద్ధి నమోదు కావడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. గత సెషన్‌లో 13.55 శాతం పెరిగి రూ. 25.89 వద్ద స్థిరపడ్డాయి. గత ఏడు నెలల్లో ఓలా స్టాక్‌లో ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదల. ప్రస్తుత పెరుగుదల కొంత ఊరటనిచ్చినప్పటికీ.. 52 వారాల గరిష్ట స్థాయితో పోలిస్తే ఈ స్టాక్ ఇంకా చాలా వెనకబడే ఉంది. అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో ఈ స్టాక్ ఏకంగా 60 శాతం వరకు క్షీణించింది. ఒకానొక దశలో రూ. 22.25 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. ఓలా షేర్ ఆల్ టైమ్ గరిష్ట ధర రూ. 157.40 కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?
