అక్షరటుడే, ఆర్మూర్: Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని కల్లెడి సర్పంచ్ గంగోల్ల సుష్మిత ప్రళయ్ తేజ్ సూచించారు. ఆలూర్ మండలంలోని కల్లెడి (Kalledi) గ్రామంలో మాక్లూర్ సహకార సంఘం (Makloor Cooperative Society) ఆధ్వర్యంలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
Paddy Procurement MSP | కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ (FCI) కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ స్వప్న, సొసైటీ సెక్రెటరీ రతన్‌లకు సూచించారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Paddy Procurement MSP | చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలి
అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సర్పంచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నీలగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర ఇస్తుందన్నారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తద్వారా ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలన్నారు. ప్రభుత్వం (Government of Telangana) చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, సీఈవో రతన్, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఫిరోజ్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, మహేష్, శివ, నర్సారెడ్డి, హబీబ్, రమేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
