అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Palamaneru Road Accident | చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు బైపాస్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. వారు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల (Tirumala)కు బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రయాణ మధ్యలో పలమనేరు బైపాస్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
Palamaneru Road Accident | అధిక వేగమే కారణమా?
కారు అధిక వేగంతో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీయడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించారు. ప్రమాద సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు (Palamaneru Police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం అధిక వేగమా, లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
Palamaneru Road Accident | వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో..
చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లోనే కాకుండా బెంగళూరు ప్రాంతంలోనూ తీవ్ర శోకం నెలకొంది. తిరుమల దర్శనానికి బయలుదేరిన కుటుంబం ఇలా దుర్ఘటనకు గురవడం స్థానికులను కలిచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లు ఫుల్..

