అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Palle Pragathi Participation | పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు.
Palle Pragathi Participation | సమస్యల కోసం ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు..
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ఒక్కో పథకం వారీగా అధికారులు పేర్లను ప్రకటించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత పథకం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు తదితర వాటి ద్వారా గ్రామంలో లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి గ్రామసభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Palle Pragathi Participation | ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా..
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు, మున్ముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు కలెక్టర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి, గ్రామ సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని తెలిపారు.
Palle Pragathi Participation | పథకాలు గురించి వివరణ..
ప్రభుత్వం రైతు భరోసా పథకం (Rythu Bharosa Scheme), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తేవాలని సూచించారు. అక్రమాలకు ఆస్కారం కల్పించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే, ఆయా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరాయని, త్వరలోనే ప్రభుత్వం రెండవ విడత కింద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. గ్రామ సభలో మోస్రా సర్పంచ్ శ్రీకాంత్, మండల ప్రత్యేక అధికారి రతన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి శ్రవణ్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
