అక్షరటుడే, వెబ్డెస్క్: PAN Card Rules | కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటే పాన్ కార్డు నిబంధనలు కూడా చాలావరకు మారాయి. పాన్ దరఖాస్తు, పాత వివరాల సవరణ విధానాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరింత కఠినతరం చేసింది. ఇప్పటివరకు పాన్ కార్డు దరఖాస్తు కోసం, సవరణల కోసం వాడుతున్న పాత ఫాంలను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తవాటిని తీసుకొచ్చింది. దరఖాస్తుదారుల గుర్తింపు, ముఖ్యంగా పుట్టిన తేదీ ధ్రువీకరణ నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో కొత్త పాన్ దరఖాస్తుల కోసం 49ఏ, 49ఏఏ ఫారాలను ఉపయోగించేవారు. వాటిని రద్దు చేసిన సీబీడీటీ.. వాటి స్థానంలో నాలుగు కొత్త ఫాంలను ప్రవేశపెట్టింది.
PAN Card Rules | కొత్త పాన్ దరఖాస్తు పత్రాలు..
- ఫాం 93: భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులకు సంబంధించినది.
- ఫాం 94: ట్రస్టులు, కంపెనీలు వంటి భారతీయ సంస్థలకు ఉద్దేశించినది.
- ఫాం 95 : విదేశీ పౌరులకు సంబంధించిన ఫాం ఇది.
- ఫాం 96: విదేశీ సంస్థలకోసం ఉద్దేశించిన ఫాం.
PAN Card Rules | పాన్ వివరాల సవరణకోసం..
ఆదాయపు పన్ను నిబంధనలు 2026, రూల్ 158(12) కింద పాన్ సమాచారం లేదా మార్పుల కోసం సీబీడీటీ కొత్త దరఖాస్తు ఫారాలను నోటిఫై చేసింది. దీని ప్రకారం పాన్ కార్డు వివరాలు మార్చుకోవాలనుకునే సాధారణ వ్యక్తులు ఇకపై ‘పాన్ సీఆర్ -01’ ఫాం ఉపయోగించాల్సి ఉంటుంది. సంస్థల కోసం ‘పాన్ సీఆర్ -02’ తీసుకువచ్చారు.
సవరణ ఫాంలో దరఖాస్తుదారు పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, పాస్‌పోర్ట్ నంబరు, మొబైల్ నంబరు, తల్లిదండ్రుల పేర్లు కచ్చితంగా నమోదు చేయాలి. పాన్ కార్డుపై తల్లి లేదా తండ్రి ఎవరి పేరు ముద్రించాలో స్పష్టంగా ఎంచుకోవాలి. పాన్ కార్డు పోతే దరఖాస్తుతో ఎఫ్ఐఆర్ కాపీ తప్పనిసరి. ఫాంను ఆఫ్‌లైన్‌లో సమర్పించినప్పుడు ఆంగ్ల పెద్ద అక్షరాల్లో నలుపు రంగు సిరాతో నింపాల్సి ఉంటుంది.
ఆధార్ ఒక్కటే సరిపోదు..
ఇప్పటివరకు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు ఒక్కటి ఉన్నా సరిపోయేది. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం మరిన్ని పత్రాలను తప్పనిసరి చేశారు. పదో తరగతి సర్టిఫికెట్, పుట్టిన తేదీ క్లారిటీగా ఉన్న పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి జత చేయాల్సి ఉంటుంది. 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించినవారికి మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
ఇది కూడా చదవండి..: Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?
