అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panneerselvam Joins DMK | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ సీఎం జయలలిత నెచ్చలి శశికళ కొత్త పార్టీ పెట్టగా.. మాజీ సీఎం, జయలలిత నమ్మకస్తుడిగా పేరున్న పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు.
అవినీతి కేసుల కారణంగా జయలలిత రెండుసార్లు సీఎం పదవికి రాజీనామా చేసిన సమయంలో తన పదవిని పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆయనే సీఎం అయ్యారు. మూడు సార్లు అన్నాడీఎంకే (AIADMK) నుంచి ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్‌సెల్వం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)లో చేరారు.
Panneerselvam Joins DMK | అన్నాడీఎంకేలో చేరేందుకు యత్నం
సెల్వంను 2022లో అన్నా డీఎంకే నుంచి బహిష్కరించారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఆయన తిరిగి సొంతగూటికి చేరడానికి యత్నించారు. బీజేపీ సహాయంతో అన్నాడీఎంకేలో తిరిగి చేరేందుకు ఆయన ప్రయత్నాలు విఫలం కావడంతో తాజాగా డీఎంకేలో చేరారు. కొద్ది రోజులుగా డీఎంకే పెద్దలతో మంతనాలు జరిపిన ఆయన తాజాగా ఆ పార్టీ గూటికి చేరారు. ఇటీవల డీఎంకే పాలనపై సెల్వం ప్రశంసలు కురిపించారు. మళ్లీ ఆ పార్టీ గెలుస్తుందన్నారు. కాగా అన్నాడీఎంకే పార్టీ ఎన్‌డీఏలోకి పన్నీర్‌సెల్వంను చేర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది కానీ ఆయనను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు నిరాకరించింది. దీంతో డీఎంకేలో చేరారు.
Panneerselvam Joins DMK | డీఎంకేకు లాభం

అసెంబ్లీ ఎన్నికలకు (Aassembly Elections) ముందు మాజీ ముఖ్యంత్రి, కీలక నేత పన్నీర్ సెల్వం తమ పార్టీలో చేరడం డీఎంకేకు మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయనకు తన సొంత జిల్లాలో మాత్రమే పట్టు ఉంది. దీంతో మిగతా ప్రాంతాల్లో డీఎంకే ఆయనతో రాజకీయ ప్రయోజనం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడిన సెల్వం తాజాగా ఆ పార్టీలో చేరడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
Panneerselvam Joins DMK | సుదీర్ఘ అనుభవం
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా పని చేశారు. 2001 నుంచి 2016 వరకు తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై దాడికి నాయకత్వం వహించాడు. జయలలిత మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పార్టీలో ఆయన స్థానం తగ్గిపోయింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన కొత్త పార్టీ పెడతారని భావించారు. అయితే ఆయన ఆ ధైర్యం చేయలేదు. తాజాగా స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు.
ఇది కూడా చదవండి..: Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్ ట్విస్ట్.. సీఎం మార్పు తప్పదా!

