హైదరాబాద్: మారుతున్న సీజన్లతో పాటు నగరాల్లో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యం మన కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉండే కాలాన్ని కళ్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా హైదరాబాద్‌కు చెందిన సీనియర్ క్యాటరాక్ట్ , రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ వివేక్ ఎమ్ సింగ్ అభివర్ణించారు. ఈ మాసాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల, గాలిలోని తేమలో మార్పుల వల్ల కళ్లలో దురద, ఎరుపు, మంట , ఏదో గుచ్చుకుంటున్నట్లు ఉండే (Foreign body sensation) సమస్యలు అధికమవుతున్నాయని ఆయన హెచ్చరించారు.
పర్యావరణ మార్పులు ప్రధానంగా మూడు విధాలుగా కంటి సమస్యలకు కారణమవుతాయి. గాలిలోని పరాగరేణువుల వల్ల కంటి పొరల్లో వాపు రావడం, ఏసీల వాడకం పెరగడం వల్ల కన్నీటి పొర త్వరగా ఆవిరైపోయి కళ్లు పొడిబారడం, అలాగే దుమ్ము , సూర్యరశ్మిలోని యూవీ కిరణాల తీవ్రత వల్ల కళ్ల ఉపరితలం దెబ్బతినడం వంటివి జరుగుతాయని డాక్టర్ వివరించారు.
నగర జీవులకు వాయు కాలుష్యం మరో పెద్ద ముప్పుగా మారింది. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు, సూక్ష్మ ధూళి కణాలు (PM2.5) కంటిలోని సున్నితమైన కణాలపై ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కలిగిస్తాయి. దీనివల్ల పట్టణాల్లో నివసించే వారిలో డ్రై ఐ డిసీజ్ , అలెర్జిక్ కంజంక్టివిటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
కళ్ల రక్షణకు డాక్టర్ సూచిస్తున్న జాగ్రత్తలు:
- బయటకు వెళ్లేటప్పుడు గాలి, ధూళి నుంచి రక్షణ ఇచ్చే సన్ గ్లాసెస్ తప్పనిసరిగా ధరించాలి. ఇది టూవీలర్ నడిపేవారికి చాలా అవసరం.
- కళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు. దీనివల్ల కంటిపై సూక్ష్మ గాయాలు కావడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ మరింత పెరుగుతుంది.
- బయటి నుంచి రాగానే ముఖాన్ని, కనురెప్పలను శుభ్రంగా కడుక్కోవాలి.
- కళ్లలో సహజమైన తేమను కాపాడుకోవడానికి ప్రిజర్వేటివ్-ఫ్రీ ఆర్టిఫిషియల్ టియర్స్ వాడటం మంచిది.
- ఏసీ లేదా ఫ్యాన్ గాలి నేరుగా కళ్లకు తగలకుండా జాగ్రత్త పడాలి.
- డిజిటల్ స్క్రీన్లు వాడేవారు 20-20-20 నియమాన్ని పాటిస్తూ కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు , కాంటాక్ట్ లెన్స్ వాడేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కంటి నొప్పి, చూపు మసకబారడం వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. సొంతంగా స్టెరాయిడ్ చుక్కల మందులు వాడటం గ్లాకోమా లేదా క్యాటరాక్ట్ వంటి సమస్యలకు దారితీయవచ్చని డాక్టర్ వివేక్ సింగ్ స్పష్టం చేశారు. సీజన్ మొదట్లోనే నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన అలర్జీల నుంచి తప్పించుకోవచ్చని ఆయన సూచించారు.

