అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raghav Chadha MP | పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళం ఎత్తే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (MP Raghav Chadha)కు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి ఆయనను తొలగించింది. ఎంపీ అశోక్ మిట్టల్‌కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ (Parliament)లో రాఘవ్‌కు మాట్లాడేందుకు సమయం కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఆ పార్టీ లేఖ రాసింది.
Raghav Chadha MP | ప్రజా సమస్యలపై పార్లమెంట్లో
ఎంపీ రాఘవ్ చద్దా అనేక ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన సభలో లేవనెత్తడంతో సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ అయ్యారు. టెలీకం కంపెనీల రీఛార్జీ ప్లాన్లు 30 రోజులకు బదులు 28 రోజులు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఇలా అనేక సమస్యలను ప్రభుత్వం, సభ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి నేతకు పార్టీ షాక్ ఇవ్వడం గమనార్హం.
Raghav Chadha MP | మైక్ ఇవ్వొద్దు
రాజ్యసభ (Rajya Sabha)లో ఆప్ కోటా నుంచి చద్దాకు మాట్లాడే సమయం ఇవ్వొద్దని పార్టీ అభ్యర్థించింది. కొత్త డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అశోక్ మిట్టల్
నియామకాన్ని వీలైనంత త్వరగా అధికారికం చేయాలని సచివాలయాన్ని కోరింది. ప్రస్తుతం రాజ్యసభలో పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఏడుగురు పంజాబ్ నుంచి, ముగ్గురు ఢిల్లీ నుంచి ఉన్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీ అయిన రాఘవ్ చద్దా పార్టీ ఆవిర్భావం నుంచి అనుబంధం కలిగి ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాజేంద్ర నగర్ నుంచి గెలిచారు. 2022లో చద్దా 33 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపీ అయ్యారు. కాగా ఆయనను పార్టీ ఆ పదవి నుంచి ఎందుకు తప్పించిందనే వివరాలు తెలియరాలేదు.
ఇది కూడా చదవండి..: I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
