అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajma Health Benefits | ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రోటీన్ Protien అవసరాన్ని తీర్చుకునేందుకు చాలామంది మొక్కజొన్న ఆధారిత ఆహార పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి ఆహారాల్లో ముందువరుసలో ఉండేది రాజ్మా (కిడ్నీ బీన్స్). మాంసాహారానికి సమానంగా ప్రొటీన్ అందించే ఈ పప్పుధాన్యం శాఖాహారులకు మంచి ప్రత్యామ్నాయంగా పోషక నిపుణులు సూచిస్తున్నారు.
Rajma Health Benefits | పోషక విలువలు సమృద్ధిగా
100 గ్రాముల రాజ్మాలో దాదాపు 22–24 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల ఫైబర్, 60 గ్రాముల కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. అదనంగా ఐరన్, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఆహారం కావడంతో కొలెస్ట్రాల్ లేకపోవడం చెప్పుకోదగ్గ విశేషం.
Rajma Health Benefits | మధుమేహ నియంత్రణకు తోడు
రాజ్మాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచన మేరకు ఆహారంగా తీసుకోవచ్చు.
గుండె ఆరోగ్యానికి మేలు
రాజ్మా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు సెలవిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి గుండె పనితీరు మెరుగుపడుతుందట. రక్తపోటు నియంత్రణలో సైతం రాజ్మా సహాయపడుతుంది.
క్యాన్సర్ ముప్పు తగ్గింపు
రాజ్మాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. దీనివల్ల పలు రకాల క్యాన్సర్‌ల ముప్పు తగ్గే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గించడంలో సహకారం
అధికంగా ఫైబర్ ఉండటం వల్ల రాజ్మా తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన ఉంటుంది. అందువల్ల తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు నియంత్రణ సులభమవుతుంది.
ఎముకలు, చర్మానికి లాభాలు
మాగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాల వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు.
మొత్తంగా చూస్తే.. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందించే సమగ్ర ఆహారం రాజ్మా. కాగా, ఏ ఆహారాన్ని అయినా మితంగా తీసుకోవాలి. వైద్యుల సలహా పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

