హైదరాబాద్: దేశంలో ఉపయోగించిన లూబ్రికేటింగ్ ఆయిల్ సేకరణ రీసైక్లింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), రీ సస్టైనబిలిటీ సంస్థతో జతకట్టింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. తక్కువ కార్బన్ ఉద్గారాల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, వనరుల పునర్వినియోగం కోసం చేపట్టిన ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఒక ప్రత్యేక విభాగాన్ని (SPV) ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా పారిశ్రామిక, ఆటోమోటివ్ రంగాల నుండి వాడేసిన చమురును సేకరించేందుకు బలమైన నెట్‌వర్క్‌ను రూపొందిస్తారు. సేకరించిన ఈ లూబ్రికెంట్లను రీ సస్టైనబిలిటీకి చెందిన అత్యాధునిక కేంద్రాల్లో శుద్ధి చేసి, గ్రూప్ I గ్రూప్ II+ రకానికి చెందిన ‘రీ-రిఫైన్డ్ బేస్ ఆయిల్’ (RRBO)గా మారుస్తారు. ఈ విధానం వల్ల ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసినట్లవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇండియన్ ఆయిల్ కంట్రీ హెడ్ బంకిమ్ పాత్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంధన భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేసే దిశగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల నుండి విలువైన వనరులను వెలికితీసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ మల్లిక్ పేర్కొన్నారు. ఏటా లక్ష టన్నుల (100 KTA) చమురు సేకరణ లక్ష్యంగా, రాబోయే మూడేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శుద్ధి కేంద్రాలను సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా ఉత్పత్తి అవుతున్న 13 లక్షల టన్నుల యూజ్డ్ ఆయిల్‌లో కేవలం స్వల్ప భాగమే రీసైక్లింగ్ అవుతుండగా, ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఆ పరిధిని భారీగా పెంచనున్నారు.

