అక్షరటుడే, వెబ్డెస్క్ : Rotten Meat Racket | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ ఆహార దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. మంగల్హాట్ పోలీస్ స్టేషన్ (Mangalhat Police Station) పరిధిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 14 వేల కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Rotten Meat Racket | అధికారులు షాక్
హెచ్ ఫాస్ట్ టీమ్, జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers), మంగళహాట్ పోలీసులు, గోల్కొండ టాస్క్ ఫోర్స్ (Golkonda Task Force) కలిసి బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ గోదాంలో భారీగా నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. అక్కడి పరిస్థితులు చూసి అధికారులు షాక్కు గురయ్యారు. దుర్వాసన భరించలేక మాస్కులు ధరించి తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది. తనిఖీల్లో భాగంగా సంచులు, డబ్బాలు తెరిచి పరిశీలించగా, ఎటు చూసినా కుళ్లిన మాంసం కనిపించింది. మొత్తం సుమారు 14 వేల కిలోల మాంసం నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
Rotten Meat Racket | కుళ్లిన మాంసం సరఫరా..
ఈ మాంసం వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి మహమ్మద్ అఫ్రోజ్ గా గుర్తించారు. ఇతడు ఆర్కే పేట్ చిస్తీ చమాన్ ప్రాంతంలో ‘ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్స్ ఆఫల్స్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చనిపోయిన, కుళ్లిన మాంసాన్ని తక్కువ ధరకు సేకరించి నగరానికి తెప్పించేవాడు.అదేవిధంగా నగరంలోని కబేళాల్లో చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని కూడా సేకరించి కోల్డ్ స్టోరేజ్ (Cold Storage) గోదాంలో నిల్వ ఉంచేవాడు. డీప్ ఫ్రీజర్లు, కెమికల్స్ కలిపిన నీటితో మాంసాన్ని నిల్వ చేసి దుర్వాసన రాకుండా మాయచేసేవాడు. అనంతరం తాజా మాంసమని చెప్పి హోల్సేల్గా విక్రయించేవాడు.
ఈ మాంసాన్ని నగరంలోని పలు మటన్ షాపులు, ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. కిలో ధర రూ.500 కంటే తక్కువగా ఉండటంతో వ్యాపారం విస్తరించినట్లు తెలుస్తోంది.గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే వ్యాపారి గోదాంలో గతంలో కూడా కుళ్లిన మాంసం పట్టుబడింది. మార్చి 12న సుమారు 300 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి జరిమానా విధించారు. అయినప్పటికీ అతడు తన అక్రమాలను కొనసాగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు తనిఖీకి వచ్చిన సమయంలో ప్రధాన నిందితుడు పరారయ్యాడు. షాపులో ఉన్న మరో వ్యక్తి మాత్రం నిర్లక్ష్యంగా స్పందిస్తూ “శాంపిల్స్ తీసుకెళ్లండి, జరిమానా వేసుకోండి” అంటూ మాట్లాడటం మరింత సంచలనం సృష్టించింది.
ఇది కూడా చదవండి..: Hyderabad traffic restrictions | హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
