అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rupee Record Low | అంతర్జాతీయ మార్కెట్‌లో భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలకు రెక్కలు రావడం, ఎఫ్ఐఐలు నిరంతరాయంగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండడం వంటి కారణాలతో మన రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
గురువారం ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.36కు పడిపోయి మరోసారి జీవన కాల కనిష్టాన్ని నమోదు చేసింది. మన కరెన్సీ రోజురోజుకూ బలహీనమవుతుండడం ఆర్థిక వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
Rupee Record Low | ఎఫ్ఐఐల అమ్మకాల ప్రభావం..
విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్‌నుంచి అలుపన్నదే లేకుండా పెట్టుబడులను ఉపసంహరిస్తూనే ఉన్నారు. గతేడాది జూలైనుంచి వారు భారత ఈక్విటీ మార్కెట్ల (Equity markets) లో నెట్‌సెల్లర్లుగానే ఉంటున్నారు. జూన్‌లో నికరంగా రూ. 7,488.98 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన ఎఫ్ఐఐలు.. ఆ తర్వాత నెలనుంచి నికర అమ్మకందారులుగానే ఉంటున్నారు. జూలైలో రూ. 47,666 కోట్లు, ఆగస్టులో రూ. 46,902 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 35,301 కోట్లు, అక్టోబర్‌లో రూ. 2,346 కోట్లు, నవంబర్‌లో 17,500 కోట్లు, డిసెంబర్‌లో 34,349 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ. 41,435 కోట్లు, ఫిబ్రవరిలో 6,640 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈనెలలో ఇప్పటికే నికరంగా రూ. 39,116 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ పడిపోతోంది.
Rupee Record Low| క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో..
క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్‌కు 60 డాలర్ల వద్ద ఉంది. గురువారం వంద డాలర్లకు సమీపంలో ట్రేడ్ అవుతోంది. రెండున్నర నెలల్లోనే సుమారు 60 శాతం ధర పెరగడం గమనార్హం. భారత్ ఎక్కువగా ముడి చమురు దిగుమతిపై ఆధారపడిన దేశం కావడంతో ధరల పెరుగుదల ప్రభావంతో రూపాయి విలువ క్షీణిస్తోంది.
Rupee Record Low | ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు సైతం రూపాయిని బలహీనపరుస్తున్నాయి. అగ్రరాజ్యాధినేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై సుంకాలు వడ్డిస్తుండడంతో ఈక్విటీ మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది. రెసిప్రోకల్ టారిఫ్స్ చెల్లవని యూఎస్ కోర్టు తీర్పు ఇచ్చినా ట్రంప్ వైఖరిలో మార్పు రావడం లేదు. అదనపు సుంకాలను విధించేందుకు కొత్తదారులు వెతుకుతుండడంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి లోహాల వైపు దృష్టి సారించడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడింది.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

