అక్షరటుడే, వెబ్డెస్క్ : Saleshwaram Jathara | పచ్చని అడవుల్లో జలపాతం సవ్వడుల మధ్య గుహలో కొలువైన పరమశివుడి దర్శనానికి వేళ అయింది. నల్లమల అడవుల్లో (Nallamala Forest) కొలువైన లింగమయ్య జాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండదారుల్లో సాహసోపేతమైన సలేశ్వరం యాత్ర తెలంగాణ అమర్నాథ్గా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర ఏప్రిల్ 1 నుంచి 3 వరకు సాగనుంది. దీంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లమల అడవుల్లో నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో సలేశ్వరం జాతర సాగుతుంది. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన సహజ శివలింగాన్ని దర్శించుకోవడం అంటే.. భక్తి యాత్ర మాత్రమే కాదు.. సాహస యాత్ర కూడా. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. నడుచుకుంటూ దాదాపు 4 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. కొండలు, గుట్టల్లో ట్రెక్కింగ్ చేస్తూ స్వామి దర్శనానికి వెళ్లాలి. ఏడాదిలో ఎక్కసారి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.
Saleshwaram Jathara | ప్రకృతి అందాల మధ్య..
సలేశ్వరం జాతర అంటే ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. అయితే ఇది సాహస యాత్ర అనే చెప్పాలి. దట్టమైన అరణ్యం, జలపాతాలు, లోతైన లోయల మధ్య యాత్ర సాగుతుంది. భక్తులు దీనిని పవిత్రంగా భావిస్తారు. నల్లమలలోని చెంచులే లింగమయ్య (Lingamayya)కు పూజారులుగా వ్యవహరిస్తారు. కాగా ఈ మార్గంలో వన్యప్రాణులు కూడా ఉంటాయి. అయినా కూడా భక్తులు స్వామివారి మీద భక్తితో వెళ్తారు.
Saleshwaram Jathara | వీరు జాగ్రత్త
ఈ యాత్రలో భాగంగా సుమారు 4 కిలోమీటర్ల మేర కాలినడకన లోయలోకి దిగాలి. కొన్ని చోట్ల దారి ఒక్క అడుగు వెడల్పు మాత్రమే ఉంటుంది. ఏ మాత్రం పట్టు తప్పిన లోయలో పడిపోతారు. ఈ మార్గంలో భక్తులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ యాత్రకు వెళ్తే జాగ్రతలు పాటించాలి. అలాగే శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న వారు వెళ్లకపోవడం ఉత్తమం. భక్తులు బూట్లు, టార్చ్, నీళ్లు వెంట తీసుకెళ్లాలి. అడవిలో చెత్త, ప్లాస్టిక్ పాడేయొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు.
Saleshwaram Jathara | ప్రత్యేక బస్సులు
సలేశ్వరం జాతర కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే యాత్ర కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
దీనిని కూడా చదవండి : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

