అక్షరటుడే, బోధన్: Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) సరిహద్దులోని సాలూర వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేయగా.. ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా శనివారం ప్రారంభించారు.
Sand Smuggling Checkpost | ఓవర్ లోడింగ్.. అక్రమ రవాణాను
ఈ చెక్ పోస్ట్ వద్ద వేయింగ్ మెషిన్‌తో ఇసుక వాహనాల తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని భవేష్ మిశ్రా తెలిపారు. తద్వారా అక్రమ ఇసుక రవాణాతో పాటు, ఓవర్ లోడింగ్‌ను సైతం నిరోధించేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని మహారాష్ట్ర నుండి నిర్ణీత పరిమాణంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించవచ్చని.. అయితే సాలూర చెక్‌పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇదివరకు చెక్‌పోస్ట్ లేకపోవడం వల్ల ఇసుక రవాణా విషయంలో పలు అక్రమాలు జరిగేవని, ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Sand Smuggling Checkpost | తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం..
దీనివల్ల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుందని టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. అంతేకాకుండా ఓవర్ లోడ్ సమస్యను నిరోధించడం ద్వారా రోడ్లు చెడిపోకుండా, రోడ్డు ప్రమాద సంఘటనలు జరుగకుండా నిలువరించవచ్చన్నారు. అదేవిధంగా నిజామాబాద్‌కు సమీపంలోనే మహారాష్ట్ర ఇసుక క్వారీలు ఉన్నందున ఇసుక అవసరమైన వారికి తక్కువధరకే ఇసుక లభ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంజీరా (Manjeera)లో ఇసుక తవ్వకాలకు సంబంధించి సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Sand Smuggling Checkpost | స్పష్టమైన సరిహద్దులు గుర్తించాం..
తెలంగాణ (Telangana) భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని, ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. ఇసుక తవ్వకం, రవాణాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటికే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎం.డీ భవేష్ మిశ్రా గుర్తు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్ పోస్ట్ నిర్వహణ సజావుగా జరగాలని, గట్టి నిఘాను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క

