అక్షరటుడే, వెబ్‌డెస్క్: Satyashodhak School | “సమాజ మార్పు మాటల్లో కాదు.. మనసుల్లో మొదలవుతుంది. ఆ మార్పునకు దిశ, నిర్దేశం చేస్తూ.. దానిని తమ జీవన విధానంగా మార్చుకున్నవారు అసాధారణ జీవన ప్రయాణం సాగిస్తారు. నిబద్ధతతో నిస్వార్థంతో ప్రారంభమైన ఆ ప్రయాణం.. ఈ తరంతోపాటు రానున్న తరాలకు సైతం దారి చూపుతుంది.. అలాంటి దృఢ సంకల్పం.. అచంచల దృష్టి.. అహర్నిషల కృషి కలిగిన విద్యావేత్తనే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన రావుట్ల పెద్ద నర్సయ్య.
జ్యోతిభా పూలే చూపిన విద్యా దీపం.. డా. బి.ఆర్. అంబేడ్కర్ అనుసరించిన సమానత్వ మార్గాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు.. జీవితంలో ఆచరిస్తూ గ్రామీణ ప్రాంతంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతున్నారు.
ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మారుమూల సిరికొండ పరిసర గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా సంస్థ నెలకొల్పాల్సిన అవసరాన్ని రావుట్ల పెద్ద నర్సయ్య గుర్తించారు.
విద్యతో పాటు ఉత్తమ క్రమశిక్షణ, ఆట పాటలు, సామాజిక చైతన్యం, సేవా దృక్పథం వంటి ఉన్నత విలువలను అలవరుస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతోపాటు తల్లిదండ్రుల ఆశయాల సాధనే లక్ష్యంగా చేసుకున్నారు.
అలా సామాజిక విప్లవోద్యమ పితామహులు మహాత్మా జ్యోతిభా పూలే, మాత సావిత్రీబాయి పూలే ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 2000–01 (06-06-2000) విద్యా సంవత్సరం సిరికొండ గ్రామంలోని ఓ అద్దె భవనంలో LKG నుంచి 5వ తరగతి వరకు 200 మంది విద్యార్థులతో సత్యశోధక్ పాఠశాలను ప్రారంభించారు.
అనతి కాలంలోనే 1 నుంచి 7 వ తరగతి వరకు, తదనంతరం 2004 వ సంవత్సరంలో సొంత భవన నిర్మాణాన్ని చేపట్టి పాఠశాలకు అవసరమైన అన్ని వసతులను ఏర్పరుచుకొని పదో తరగతి వరకు ఈ ప్రాంతంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన మొట్టమొదటి విద్యాసంస్థగా సత్యశోధక్ పాఠశాల నిలిచింది.
పాఠశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంత విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దుతూ ప్రస్తుతం 1500 మంది విద్యార్థులు, 57 మంది బోధన సిబ్బంది, 18 మంది బోధనేతర సిబ్బందితో 25 వసంతాలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని 26వ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించుకుంటోంది సత్యశోధక్ పాఠశాల.
అత్యున్నత మానవ వనరుల అభివృధ్ధే ధ్యేయంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, సమకాలీన ఉత్తమ విద్యాబోధన, మమేకంతో బాల్యదశ నుంచే విద్యార్థులకు మానవీయ విలువలు, జీవన నైపుణ్యాలు పెంపొందిస్తూ గత 25 సం॥లుగా గ్రామీణ విద్యార్థులను మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించేలా తీర్చిదిద్దుతూ సిరికొండ ప్రాంతానికి వన్నె తెచ్చిన చిరస్మరణీయమైన మైలురాళ్ళు సత్యశోధక్ సొంతం.
శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం, సామాజిక చైతన్యం సేవా ధృక్పథంతో పాటు క్రీడా ప్రాభవాన్ని అందిస్తూ తల్లిదండ్రుల ఆశల ప్రతి రూపాలుగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ పదో తరగతి ఫలితాలతో రికార్డుస్థాయి మార్కులు/ గ్రేడింగ్ పాయింట్లు పొందుతూ ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఉత్తీర్ణత సాధిస్తూ మారుమూల ప్రాంత విద్యాకుసుమాలను పరిమళింపజేస్తూ సాటిలేని మేటి విద్యాసంస్థగా ప్రజ్వరిల్లుతోంది సత్యశోధక్ పాఠశాల. ఈ నెల (ఏప్రిల్) 11వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

Satyashodhak School | SSC Results:
పదో తరగతి మొదటి బ్యాచ్‌ను 2005–06 విద్యా సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి (2024–25) వరకు 20 బ్యాచ్ లలో 1500లకు పైగా విద్యార్థులను ఉత్తమ మార్కులు, గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తోంది. ప్రస్తుతం 89 మంది విద్యార్థులను (21వ బ్యాచ్ ను) సన్నద్ధం చేసింది. గత SSC ఫలితాలలో 581, 578, 573, 572.. ఇలా 550 కి పైగా 26 మంది, 500 కు పైగా మార్కులను 73 మంది విద్యార్థులు సాధించడమే కాకుండా వందశాతం ఉత్తీర్ణతను సాధించడం విశేషం.
ఏటా పాలిసెట్, TGRJC వంటి ప్రవేశ పరీక్షలలో సైతం ఉత్తమ ర్యాంకులు సాధించడంతో పాటు ఉన్నత విద్య సంస్థలలో ప్రవేశం పొందుతున్నారు. దీనికితోడు IIIT బాసరకు కూడా ఈ బడి విద్యార్థులు ఎంపికవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత విద్యలో రాణిస్తూ ప్రతిష్ఠాత్మకమైన IIT, NIT విద్యా సంస్థలలో సైతం సీట్లను సాధించి విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఈ పాఠశాలలో చదివి వివిధ రంగాలలో software, పోలీసు శాఖ, త్రివిధ దళాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో స్థిరపడటంతో పాటు ఇటీవల ప్రకటించిన గ్రూప్ – 3, గ్రూప్ – 4 ఫలితాలలో సైతం విజేతలుగా నిలిచి ఉద్యోగాలు సాధించారు.
Satyashodhak School | Scouts & Guides:
విద్యార్థి దశ నుంచే ఉత్తమ క్రమశిక్షణ, సేవాభావం అలవరుచుటకు స్కౌట్స్ – గైడ్స్ లో విద్యార్థులను చేర్పించి మంచి శిక్షణతో పాటు పల్స్ పోలియో, రోడ్డు భద్రత వంటి చైతన్యం కొరకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనికితోడు వివిధ వైద్య శిబిరాలలో తమ సేవలను కొనసాగిస్తున్నారు.
అంతేకాకుండా రాష్ట్ర – జాతీయ స్థాయి కార్యక్రమాలలో సైతం విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుతూ ప్రతిష్ఠాత్మకమైన రాజ్యాపురస్కార్ (గవర్నర్) అవార్డులను పొందుతున్నారు.
హైదరాబాద్‌లో జరిగే గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లలో సైతం సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం విశేషం. ఇక వివిధ జాతీయ స్థాయి జాంబోరీల్లోనూ పాల్గొంటూ ప్రతిభ కనబరుస్తూ ఉత్తమ గ్రేడ్ సాధించి పలువురి ప్రశంసలు పొందుతున్నారు.
ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ అండ్ డైమండ్ జూబ్లీ గ్రాండ్ ఫినాలిలో తెలంగాణ రాష్ట్రం తరఫున సత్యశోధక్ పాఠశాలకు చెందిన 11మంది స్కౌట్స్ & గైడ్స్ విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించారు.
గత రెండు జాతీయ జాంబోరిలలో తెలంగాణ రాష్ట్రం తరఫున కలర్ పార్టీ ప్రదర్శనకు సత్యశోధక్ పాఠశాల విద్యార్థులే బాధ్యత వహించడం విశేషం.
Satyashodhak School | Satyashodhak School NGC:
మానవాళి మనుగడ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని, భూమి మీదున్న సమస్త జీవరాశి అంతటికీ ప్రాణవాయువు ప్రకృతిలో భాగమైన వృక్షాల నుంచి లభిస్తుందని పాఠశాల తరఫున విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ను ప్రారంభించారు.
దీనికితోడు విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రకృతి సంరక్షణకై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల ఇంటి పరిసరాలలో మొక్కల పెంపకం చేపడుతున్నారు. వారి ప్రతి జన్మదినాన ఒక మొక్క నాటేలా ప్రోత్సహిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ – ఆవశ్యకత, ప్లాస్టిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత, మట్టి వినాయకుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు గోడ ప్రతులు, కరపత్రాలను రూపొందించి ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు ర్యాలీలు, మానవహారం లాంటివి నిర్వహిస్తున్నారు. చెట్లను మానవులుగా భావించి వృక్ష రక్షా బంధన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వివిధ సందర్భాలలో ప్రముఖులచే పాఠశాల ఆవరణలో మొక్కలను నాటించి, వాటిని సంరక్షించేలా నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు కృషి చేస్తున్నారు.
Satyashodhak School | Sports & Games:
విద్యార్థులకు శారీరక, మానసిక వికాసానికి వివిధ క్రీడల నిర్వహణతో పాటు నైపుణ్యత సాధించుటకు ప్రత్యేక శిక్షణనిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతలయ్యేలా తీర్చిదిద్దుతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్, నిజామాబాద్ రీజనల్ స్థాయి మేజర్ లీగ్ బేస్ బాల్ (MLB CUP) ఛాంపియన్ షిప్ సాధించడంతో పాటు బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నైపుణ్యం ప్రదర్శించారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మండల స్థాయి క్రీడలలో రాణించి మార్చ్ పాస్ట్ తో పాటు వివిధ క్రీడలలో అనేక పతకాలు, బహుమతులు సాధించారు. దీనికితోడు ఏటా జిల్లా, రాష్ట్ర స్థాయి వివిధ(వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, softball) పోటీల్లో పాల్గొంటున్నారు.
Satyashodhak School | Postal (Deen Dayal Sparsh Yojana):
జాతీయ తపాలాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘దీన్ దయాల్ స్పర్శ్ యోజన’ ఉపకార వేతనాలకు ఏటా పాఠశాల నుంచి విద్యార్థులు ఎంపికై, రూ.6000/- ఉపకార వేతనం పొందుతున్నారు.
ఈ విద్యా సంవత్సరం (2025-26) పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన 45 మంది విద్యార్థులలో 11 మంది సత్యశోధక్ పాఠశాల విద్యార్థులే కావడం విశేషం.
Satyashodhak School | SRF:
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గణితం, సామాన్య శాస్త్రం ఒలింపియాడ్ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు పొందుతున్నారు.
ఈ విద్యా సంవత్సరం ఆరుగురు విద్యార్థులు జిల్లాస్థాయికి, నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
Satyashodhak School | Abacus & Vedic Maths:
విద్యార్థులకు గణితమంటే కఠినమనే భావనను తొలగించి సులభంగా, వేగంగా గణిత సమస్యలను సాధించుటకు అబాకాస్ & వేదిక్ మ్యాథ్స్ లలో ఇచ్చే ప్రత్యేక శిక్షణ ద్వారా వివిధ పోటీ పరీక్షలలో అత్యంత ప్రతిభ కనబరిచి ఛాంపియన్లుగా నిలుస్తున్నారు.
ఇటీవల విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో అబాకాస్ & వేదిక్ మ్యాథ్స్ వివిధ విభాగాలలో రాష్ట్ర స్థాయిలో 8 మంది విద్యార్థులు, జాతీయస్థాయి లో ఆరుగురు విద్యార్థులు పాల్గొని ప్రతిష్ఠాత్మక బహుమతులు సాధించారు. దీనికితోడు ముగ్గురు విద్యార్థులు (అబాకాస్ లో ఇద్దరు, వేదిక్ మ్యాథ్స్ లో ఒకరు) అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.
Satyashodhak School | Navodaya & Gurukula:
ప్రాథమిక పాఠశాల విద్యలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జవహర్ నవోదయ, గురుకుల విద్యాలయాలకు ప్రతి సంవత్సరం ఎందరో విద్యార్థులను ఎంపిక చేస్తున్న ఏకైక గ్రామీణ విద్యాసంస్థగా సత్యశోధక్ పాఠశాల వెలుగొందుతోంది. ఈ విద్యా సంవత్సరం (2025-26) జవహర్ నవోదయ విద్యాలయానికి 6వ తరగతికి ఏడుగురు, 9వ తరగతికి ఒకరు, వివిధ గురుకుల విద్యాలయాలకు 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
Satyashodhak School | Social service & Awareness Programs:
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా తమ వంతు సహాయాన్ని అందిస్తూనే ఇతరులను భాగస్వాములను చేస్తూ విరాళాలను సేకరించి ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. గుజరాత్ భూకంపం, కొస్తాంధ్రలో వరదలు, సునామి సమయాల్లో అధిక మొత్తంలో విరాళాలను సేకరించి వాటిని అప్పటి కలెక్టర్లకు అందజేశారు.
భారత సైనిక త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞత, గౌరవం వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం అమరవీరుల సైనిక్ సంక్షేమ నిధికి విరాళాలు అందిస్తూ, సైనికుల కుటుంబాలకు సహాయం చేయడంలో తోడ్పడుతున్నారు.
Satyashodhak School | Malidasha Telangana Movement:
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సిరికొండ మండలంలో JAC ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారు. రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు, ధర్నాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించారు.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 2011 నవంబరు 8న ప్రజా యుద్దనౌక గద్దర్ సత్యశోధక్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతతో పాటు సామాజిక చైతన్యం, జ్యోతిభా పూలే, సావిత్రి బాయి పూలే పోరాటాలను, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని, సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు.
Satyashodhak School | Regular Activities:
విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధి కల్పించుటయే ప్రధాన లక్ష్యంగా విద్య, సాంస్కృతిక, సామాజిక, ఆటపాటలతో పాటు వివిధ సబ్జెక్టు ల విషయ పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించుటకు సంఘ సంస్కర్తలు, మహనీయులు, స్ఫూర్తి ప్రదాతల జయంతులు, వర్ధంతులను పురస్కరించుకొని వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులలో నవీన అంశాలపై అవగాహన పెంపొందించేందుకు గణిత, సైన్స్, సాంఘిక శాస్త్రం, భాషా అంశాలపై కార్యశాలలను నిర్వహిస్తూ వారిలో సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. నూతన ఆవిష్కరణల పట్ల వారిలో ఆసక్తిని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు.
వివిధ సందర్భాలను పురస్కరించుకొని విద్యార్థులను సామాజిక చైతన్య కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులను సందర్శనలు, క్షేత్ర పర్యటనలు, చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకెళ్లి వారికి బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పిస్తున్నారు.
సామాజిక, పర్యావరణ, ప్రకృతి అంశాలతో మమేకం చేయడం ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విద్యార్థులతోపాటు ప్రజలలో అవగాహనను పెంపొందిస్తున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుటకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రేరణాత్మక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో చైతన్యాన్ని కల్పిస్తున్నారు.
Satyashodhak School | Society Activities : Jyotirao Phule & Savitribai Phule Vardanti & Jayanti:
పాఠశాల ప్రారంభం 2000 సంవత్సరం నుంచి ఏటా జ్ఞానజ్యోతి ప్రతీక మహాత్మా జ్యోతిభా పూలే, కాంతిరేఖ మాత సావిత్రిబాయి పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం సత్యశోధక్ పాఠశాల ఆనవాయితీగా చేసుకున్నారు.
జ్యోతిభా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల స్థాయిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్స్ కు అవార్డులు, నగదు పురస్కారాలను అందజేస్తున్నారు.
సిరికొండ మండలంలోని వివిధ పాఠశాలల, కళాశాల స్థాయి విద్యార్థులకు ప్రజ్ఞా పాటవ పోటీలు (పాటలు, చిత్ర లేఖనం, వ్యాసరచన, చెస్), యువతకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం సత్యశోధక్ సమాజ్ సంప్రదాయంగా చేసుకున్నారు.
సామాజిక చైతన్యం కోసం విద్యార్థులకు 2003 – 2008 లలో అంటరానితనం, సామాజిక చైతన్యం- తెలంగాణ సాధన అనే అంశాలపై జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తూ సత్యశోధక్ సమాజ్ ఆశయాల సాధనలో తమ వంతు ప్రయత్నం చేశారు.
సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళల్లో చైతన్యం, స్ఫూర్తి, ప్రేరణ కలిగించాలనే భావనతో మండలంలోని ఉత్తమ మహిళా ఉపాధ్యాయిని, ఉత్తమ మహిళా ఉద్యోగిని అవార్డులను అందజేస్తున్నారు. తద్వారా మహిళా సాధికారతను పెంపొందించడంలో సత్యశోధక్ పాఠశాల ముందుంటోంది.
మొత్తం మీద మారుమూల గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సత్యశోధక్ పాఠశాల విశేషంగా కృషి చేస్తోంది.
