అక్షరటుడే, వెబ్డెస్క్ : SC Categorization Support | ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సామాజిక వర్గం డిమాండ్‌లో న్యాయం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టపరమైన మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాదిగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎంను ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని లలిత కళా తోరణంలో జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజలకు చెందినదని అన్నారు. 2023 ఎన్నికల సమయంలో తన పార్టీకి పరిపాలనా యంత్రాంగం, అక్రమ సంపద లేదన్నారు. తమపై అక్రమ కేసులు పెట్టి, మరోవైపు అక్రమ సంపాదన గెలవాలని ప్రయత్నించారని బీఆర్ఎస్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేవారు. నిజాయితీ, అంకితభావంతో ఎన్నికల్లో నిలబడిన తమకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు.
SC Categorization Support | మద్దతు ఇచ్చా
ఎస్సీ వర్గీకరణ అంశం చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని సీఎం అన్నారు. న్యాయం కోసం పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. తాను 20 సంవత్సరాలకు పైగా పోరాటాన్ని స్వయంగా చూశానని పేర్కొన్నారు. వీలు అయినప్పుడల్లా వర్గీకరణకు మద్దతు తెలిపానన్నారు. మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga), సతీష్ మాదిగ వంటి నాయకులు తనను సంప్రదించినప్పుడు, తాను మద్దతు ఇచ్చి వారికి అండగా నిలిచానని గుర్తు చేసుకున్నారు.
SC Categorization Support | అండగా నిలిచా
మాదిగ వర్గం డిమాండ్‌లో న్యాయం ఉందని, సమాజంలోని బలహీన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున తాను వారికి అండగా నిలిచానని సీఎం అన్నారు. రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, మాదిగ వర్గానికి మద్దతు ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

