అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shreyas Iyer | ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మరోసారి తన సత్తా చాటింది. శుక్రవారం ఎం.ఏ. చిదంబరం స్టేడియం (M.A. Chidambaram Stadium)లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Shreyas Iyer | పంజాబ్ జట్టుకు భారీ షాక్
ఈ గెలుపుతో పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మ్యాచ్ అనంతరం ఐపీఎల్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ పంజాబ్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడం (స్లో ఓవర్ రేటు) కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కి రూ.24 లక్షల జరిమానా విధించింది.
Shreyas Iyer | రెండోసారి తప్పిదం… జరిమానా రెట్టింపు
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఇది రెండోసారి. మొదటి తప్పిదానికి అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించగా, ఇప్పుడు అదే తప్పిదం మళ్లీ పునరావృతం కావడంతో జరిమానాను రూ.24 లక్షలకు పెంచారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ ఉల్లంఘనలకు ఈ శిక్షలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ పంజాబ్ కింగ్స్ మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును కొనసాగిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆటగాళ్లకు కూడా రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించబడుతుంది.
Shreyas Iyer | పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన
మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది.ఆయుష్ మాత్రే – 73 (43 బంతులు), శివమ్ దూబే – 45* (27 బంతులు), సర్ఫరాజ్ ఖాన్ – 32 (12 బంతులు) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీసి రాణించగా, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ సాధించారు. అనంతరం ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. శ్రేయస్ అయ్యర్ – 50 (29 బంతులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ – 43 (34 బంతులు), ప్రియాన్ష్ ఆర్య – 39 (11 బంతులు) రాణించారు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది వరుసగా రెండో ఓటమి. తమ సొంత మైదానంలో కూడా ఓడిపోవడం జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. బౌలింగ్ విభాగంలో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ చెరో రెండు వికెట్లు తీసినా జట్టును గెలిపించలేకపోయారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Sports Development | క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
