అక్షరటుడే, వెబ్డెస్క్ : Subsidy Tractors Farmers | రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం (Horticulture Mechanization Scheme) అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ (Sangareddy Collectorate) ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను మంత్రి పంపిణీ చేశారు. ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి రూ.4.9 లక్షల విలువ గల 20 హెచ్‌పీ కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేశారు.
Subsidy Tractors Farmers | సాగు ఖర్చు తగ్గించుకోవాలి
వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ ఎంతో అవసరమని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆధునిక పద్ధతులు, యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, డీఆర్‌డీవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Subsidy Tractors Farmers | పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి

రాష్ట్రంలో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (Digital Health Profile) వ్యవస్థను అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు అమలు విధానం, ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై చర్చించారు.
ఇది కూడా చదవండి : ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

