అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sudarshana Chakra Story | మన పౌరాణిక గాథల్లో అత్యంత విశిష్టమైనది.. తిరుగులేని శక్తి కలిగినది శ్రీమహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం Sudarshana Chakra. విష్ణుసహస్రనామం సైతం ఈ మహా ఆయుధంలోని అనంతమైన శక్తిని, దాని ప్రాముఖ్యాన్ని కొనియాడింది. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి ఈ చక్రాన్ని ప్రయోగిస్తుంటారు. అసలు ఈ శక్తిమంతమైన ఆయుధం ఎలా ఉద్భవించిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
Sudarshana Chakra Story | సూర్యతేజస్సుతో ఉద్భవించిన వైనం:
పురాణాల ప్రకారం.. దేవశిల్పి అయిన విశ్వకర్మ ఈ సుదర్శన చక్రాన్ని రూపొందించారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. విశ్వకర్మ తన కుమార్తెను సూర్యభగవానుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే, సూర్యుడి అపరిమితమైన వేడిని భరించే శక్తి ఆమెకు లేకపోయింది. తన కుమార్తె పడుతున్న ఇబ్బందిని గమనించిన విశ్వకర్మ, సూర్యుడి వేడిని, కాంతిని కొంత తగ్గించేందుకు ఆయనను సానపట్టారు.
ఆ సమయంలో సూర్యుడి నుంచి రాలిన పవిత్రమైన చూర్ణంతో విశ్వకర్మ మూడు అద్భుతమైన వస్తువులను సృష్టించారట..
మొదట పుష్పక విమానాన్ని తయారు చేశారు. ఆ తర్వాత శివుడి కోసం త్రిశూలాన్ని రూపొందించారు. చివరగా అత్యంత వేగవంతమైన, అజేయమైన సుదర్శన చక్రాన్ని తయారు చేశారు.
Sudarshana Chakra Story | దుష్టశిక్షణలో సుదర్శన చక్రం:
అధర్మాన్ని అంతమొందించడంలో సుదర్శన చక్రం పాత్ర అమోఘం. దీనికి సంబంధించిన కొన్ని ప్రధాన ఘట్టాలు ఇవే:
శిశుపాల వధ: శ్రీకృష్ణుడు తన మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం శిశుపాలుడి వంద తప్పులను భరిస్తాడు. కానీ ఆ హద్దు దాటగానే, సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడిని సంహరించి లోకాన్ని రక్షిస్తాడు.
గజేంద్ర మోక్షం: మొసలి నోట చిక్కుకున్న గజేంద్రుడిని కాపాడేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపి ఆపదను తొలగిస్తారు. ఇలా ఎన్నో సందర్భాల్లో భక్తులను రక్షించడానికి ఈ ఆయుధం తోడ్పడింది.
నేటికీ సజీవమైన ప్రాధాన్యం:
ఆధ్యాత్మికంగా సుదర్శన చక్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండటం విశేషం. అంతేకాకుండా, తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముగింపు రోజైన చక్రస్నానం కార్యక్రమం స్వామి వారి సుదర్శన చక్ర విశిష్టతను భక్తులకు చాటిచెబుతుంది. స్వామి పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు.
ఇది కూడా చదవండి: Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు

