అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sukhoi Fighter Jet | అసోంలో భారత వాయుసేనకు చెందిన కీలకమైన సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసోంలోని వైమానిక ప్రాంతంలో శిక్షణ కొనసాగుతున్న సమయంలో SU-30 యుద్ధ విమానం రాడార్ కాంటాక్ట్ నుంచి అకస్మాత్తుగా మిస్ అయినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన భారత వాయుసేన (IAF) సదరు విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది.
Sukhoi Fighter Jet | శిక్షణ జరుగుతుండగా..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుఖోయ్ యుద్ధ విమానం సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎగిరిన కొద్దిసేపటికే రాడార్ నుంచి సిగ్నల్స్ కోల్పోయినట్లు సమాచారం. విమానం చివరిసారిగా సిగ్నల్ ప్రాంతాన్ని గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, విమానాలను గాలింపులో వినియోగిస్తున్నట్లు తెలిసింది.
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్‌కు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా ? లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా ? లేదా ఇతర కారణాల వల్ల మిస్ అయిందా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానంలో పైలట్‌లు.. వారి పరిస్థితి ఏమిటనే దానిపైనా స్పష్టత రాలేదు.
తాజా ఘటనతో అసోంతోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గల్లంతైన సుఖోయ్ యుద్ధ విమానం ఆనవాళ్లు గుర్తించేందుకు వాయుసేనతో పాటు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

