అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20 World Cup 2026 Semifinal Rain | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC T20 World Cup 2026) తుది దశకు చేరుకుంది. మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లతో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
బుధవారం (మార్చి 4) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్–సౌతాఫ్రికా తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో భారత్–ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.
T20 World Cup 2026 Semifinal Rain | వర్షం వస్తే ఏం జరుగుతుంది?
ప్రస్తుతం వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి వర్షం అంతరాయం కలిగిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ కావడంతో ఒక బంతి కూడా పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే (ICC Reserve Day) కేటాయించింది. మ్యాచ్ పూర్తికాకపోతే లేదా మధ్యలో ఆగిపోతే, మరుసటి రోజు అదే స్థితి నుంచి ఆటను కొనసాగిస్తారు. అంటే మొదటి రోజు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగుతుంది.
T20 World Cup 2026 Semifinal Rain | ఇంగ్లండ్ నేరుగా ఫైనల్
అయితే వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తిగా దెబ్బతింటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో మ్యాచ్ ఫలితం రాకపోతే సూపర్-8 దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టుకే ఫైనల్ టికెట్ లభిస్తుంది. గ్రూప్-1లో సౌతాఫ్రికా టాప్‌గా నిలిచింది. గ్రూప్-2లో న్యూజిలాండ్ రన్నరప్‌గా ముగించింది. కాబట్టి సౌతాఫ్రికా–న్యూజిలాండ్ మ్యాచ్ వర్షంతో రద్దైతే సౌతాఫ్రికా (South Africa) ఫైనల్ చేరుతుంది. గ్రూప్-2లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1లో భారత్ రన్నరప్‌గా సెమీస్ చేరింది. ఈ నేపథ్యంలో భారత్–ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇంగ్లండ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
ఈ పరిస్థితుల్లో భారత అభిమానులు వర్షం వలన అంతరాయం కలగకూడదని కోరుకుంటున్నారు. ముఖ్యంగా నాకౌట్ దశలో మ్యాచ్ రద్దు కావడం జట్టు భవితవ్యాన్ని నిర్ణయించే పరిస్థితి రావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..: India T20 Semifinal | కరేబియన్ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్లోకి భారత్

