అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20 World Cup Final | ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. టైటిల్ కోసం టీమిండియా, న్యూజిలాండ్ (New Zealand) జట్లు తలపడనున్నాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు రాత్రి 7 గంటలకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ (T20 World Cup Final) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలాగే మొత్తం మూడు సార్లు ట్రోఫీ సాధించిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
T20 World Cup Final | భారత జట్టు బలాలు
న్యూజిలాండ్ జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతోంది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న కివీస్ జట్టు ఈసారి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. భారత జట్టులో పలువురు ఆటగాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ గత రెండు మ్యాచ్‌ల్లో 97 నాటౌట్, 89 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. టాప్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) వంటి బ్యాటర్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా Jasprit Bumrah ఈ టోర్నీలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. అతని ఎకానమీ రేట్ 6.63గా ఉంది. సెమీఫైనల్‌లో చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) 13 వికెట్లతో టోర్నీలో టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండటంతో అతని పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.
T20 World Cup Final | కివీస్ జట్టులో..
కివీస్ జట్టులో కూడా పలువురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా అల్లెన్ (Finn Allen) సెమీఫైనల్‌లో 33 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. అతనిని త్వరగా అవుట్ చేయడం భారత్‌కు అత్యంత కీలకం. అలాగే ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ శాంట్నర్ (Mitchell Santner) కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు బలంగా నిలుస్తున్నారు. అహ్మదాబాద్‌లోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే రాత్రి మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కొంత నెమ్మదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ న్యూజిలాండ్‌ను ఓడించలేదు. ఈ రెండు జట్లు ఎదురెదురుగా తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ జట్టు విజయం సాధించింది.

