అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup Semifinals |ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ (ICC Men’s T20 World Cup 2026) క్లైమాక్స్ దశకు చేరుకుంది. సూపర్-8 పోరాటాలు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు దాదాపు ఖరారయ్యాయి.
ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా, తాజాగా న్యూజిలాండ్ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. శనివారం పల్లెకెలెలో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ ఆశించినంత భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సెమీస్ చేరాలంటే కనీసం 65 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా, కేవలం 5 పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది. దీంతో నెట్ రన్‌రేట్‌లో న్యూజిలాండ్‌ను అధిగమించలేకపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
T20 World Cup Semifinals | 2015 జ్ఞాపకాలు మళ్లీ
గ్రూప్-2లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక గ్రూప్-1 టాపర్ సౌతాఫ్రికా న్యూజిలాండ్‌తో తొలి సెమీఫైనల్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 4న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరగనుంది. ఈ సెమీఫైనల్ పోరు 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌ను గుర్తు చేస్తోంది. అప్పుడు కూడా ఈ రెండు జట్లు తలపడగా న్యూజిలాండ్ గెలిచి ఫైనల్‌కు చేరింది. ఈసారి సౌతాఫ్రికా పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక కివీస్ మరోసారి పైచేయి సాధిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత టీ20 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఈసారి కప్పు సాధించాలనే పట్టుదలతో ఉంది.
T20 World Cup Semifinals | మరో బెర్త్ ఎవరికో..
రెండో సెమీఫైనల్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో జరగనుంది. గ్రూప్-2 టాపర్ ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్‌లో ఉంది. ఆ జట్టును ఢీకొట్టే జట్టు ఏదనేది ఆదివారం జరిగే నిర్ణయాత్మక పోరుతో తేలనుంది. ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే, వరుసగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్ పోరు చూడొచ్చు. 2022లో ఇంగ్లాండ్, 2024లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఆసక్తికరంగా, ఆ సెమీస్‌లో గెలిచిన జట్టే చివరకు ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తం మీద సెమీఫైనల్ సమరాలు అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఈసారి కప్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి : T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి

