అక్షరటుడే, హైదరాబాద్: Telangana EAPCET Cancellation | తెలంగాణలో ఉన్నత విద్యా ప్రవేశాల విధానంపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ (EAPCET) రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు విభిన్నంగా స్పందిస్తున్నారు.
Telangana EAPCET Cancellation | ఇదీ పరిస్థితి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వృత్తిపరమైన కోర్సులకు ప్రవేశ పరీక్షగా 1986లో EAMCET (Engineering, Agriculture and Medical Common Entrance Test) ను ప్రవేశ పెట్టారు. దీని ఉద్దేశం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలతో విద్యార్థుల మెరిట్‌ను నిర్ణయించడం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం TS EAMCET ను తీసుకొచ్చింది. ఆ తర్వాత జాతీయ స్థాయి పరీక్ష NEET పరిధిలోకి వైద్య కోర్సులు వెళ్లడంతో.. ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన పరీక్షను పేరు మార్చుతూ.. TS EAPCET (Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) ను తీసుకొచ్చింది.
Telangana EAPCET Cancellation | ప్రవేశ పరీక్షల ప్రాధాన్యం
EAPCET ప్రవేశ పరీక్ష ప్రధాన ఉద్దేశాలు:
- ఒకే విధమైన మెరిట్ ప్రమాణం నిర్ణయించడం.
- ఇంటర్ పరీక్షల్లో ఉండే బోర్డు / కాలేజీ పరంగా ఉన్న వ్యత్యాసాలను సమతుల్యం చేయడం
- పోటీ పరీక్ష ద్వారా విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేయడం
- జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన JEE, NEET కు సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో ఎంపిక ప్రక్రియ చేపట్టడం
- ప్రతిభ కలిగిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్యలో అవకాశాలు పొందే అవకాశం కల్పించడం
- 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడితే ఎదురయ్యే సమస్యలు….
- మాస్ కాపీయింగ్ : ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో కాపీయింగ్, మార్కుల దందా వంటి ఆరోపణలు ఉన్నాయి.
- బోర్డుల మధ్య వ్యత్యాసాలు: వివిధ బోర్డుల ప్రశ్నాపత్రాల కఠినత స్థాయిలు, మూల్యాంకన విధానాలు వేర్వేరుగా ఉంటాయి.
- మెరిట్‌కు భంగం: ప్రవేశ పరీక్షలో విశ్లేషణాత్మక ఆలోచన, సమయపాలన, పోటీ సామర్థ్యాన్ని ప్రవేశ పరీక్ష ద్వారా పరీక్షిస్తారు. కేవలం మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తే నిజమైన ప్రతిభ వెలుగు చూడదు.
- జాతీయ ప్రమాణాలకు విరుద్ధం: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, వైద్య ప్రవేశాలకు JEE, NEET పరీక్షలు కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్ష రద్దు చేయడం సమంజసం కాదని విశ్లేషకుల అభిప్రాయం.
Telangana EAPCET Cancellation | అనుకూల వాదనలు..
- విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది
- కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం తగ్గవచ్చు
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉపశమనం
Telangana EAPCET Cancellation | పరీక్ష రద్దుతో ఏర్పడే నష్టం…
- ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం
- ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రభావం
- భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల పోటీలో విద్యార్థులు వెనుకబడే ప్రమాదం
ప్రైవేట్ కాలేజీల్లో పారదర్శకతపై అనుమానాలు..
మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఎంపిక విధానం EAMCET / EAPCET. దీని ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ,వ్యవసాయ విద్య రంగాల్లో ప్రవేశాలు పొందారు. ఒకేసారి ప్రవేశ పరీక్షను రద్దు చేసి కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించడం వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
విద్యా రంగ నిపుణుల సూచన..
ఈఏపీ సెట్ పూర్తిగా రద్దు చేయడం కాకుండా.. ఇంటర్ మార్కులకు కొంత వెయిటేజీ ఇవ్వడం, ప్రవేశ పరీక్షకు మరికొంత వెయిటేజీ ఇవ్వడం వంటి సమతుల్య విధానాలను పరిశీలించమని సూచన చేస్తే బాగుంటుందని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఏది ఏమైనా తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యా భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుంది. విద్యార్థుల మెరిట్, ప్రయోజనాలు, పారదర్శకతను సమతుల్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్

