అక్షరటుడే, హైదరాబాద్: Telangana IPS Cadre | తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రితో సీఎం భేటీ అయ్యారు.
రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో నిర్వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని తెలిపారు.
Telangana IPS Cadre | అనేక సవాళ్లు..
దేశంతో పాటు తెలంగాణ కూడా డ్రగ్స్, సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు సహా అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ మహా నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందన్నారు.
మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచాలన్నారు.
Telangana IPS Cadre | మావోయిస్టుల లొంగుబాటుపై
ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో సీఎం చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, పునరావాసం అంశాలపై చర్చించారు. గత రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారన్నారు. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీపీ బి. సుమతి ఉన్నారు.

