అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana SSC Exams | తెలంగాణలో నిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల రద్దు అంశంపై రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా విద్యా సంస్కరణలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ గందరగోళం ఏర్పడింది.
సీఎం వ్యాఖ్యలలో భాగంగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్‌సీ (10వ తరగతి), ఇంటర్మీడియట్ బోర్డులను రద్దు చేసి ఒకే ఉమ్మడి బోర్డు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా (Social Media), కొంత మీడియా వర్గాల్లో “10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తిగా రద్దవుతున్నాయి” అనే వార్తలు వేగంగా వ్యాపించాయి.
Telangana SSC Exams | విద్యాశాఖ క్లారిటీ
ఈ ప్రచారంపై స్పందించిన తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్, ఈ వార్తలను ఖండించారు. తమ కమిషన్ నివేదికలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం విడివిడిగా ఉన్న ఎస్ఎస్‌సీ మరియు ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. అదే సమయంలో, 11వ తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams)లను మాత్రమే రద్దు చేయాలని తమ నివేదికలో ప్రతిపాదించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విద్యాశాఖ (Education Department) ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలకే ప్రాముఖ్యత ఇవ్వాలని కోరింది.
Telangana SSC Exams | విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని స్పష్టం
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా 10+2 వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నదని, కమిషన్ ఇచ్చిన నివేదిక తుది నిర్ణయం కాదని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్‌పై కవిత విమర్శలు

