అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Russia Oil Sanctions | అమెరికా, ఇజ్రాయెల్ -ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించడానికి చమురు ఉత్పత్తి చేసే దేశాలపై కొన్ని ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు.
రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక.. అమెరికా రష్యా ఆయిల్ (Russian Oil)పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేయొద్దని ఆదేశించింది. దీంతో యూరప్ సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేశాయి. ఈ క్రమంలో భారత్, చైనా రష్యా ఆయిల్ కొనుగోళ్లను పెంచాయి. భారత్‌కు రష్యా డిస్కౌంట్‌పై ముడి చమురు సరఫరా చేసింది. అయితే ఇటీవల అమెరికా టారిఫ్ (American Tariff)ల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించింది.
Trump Russia Oil Sanctions | ఉద్రిక్తతలతో తగ్గిన ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసి వేయడంతో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుండటంతో ముడి చమురు రవాణా, ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతులకు ట్రంప్ ఓకే చెప్పారు. ఆ దేశంపై గతంలో విధించిన ఆంక్షలు ఎత్తి వేసినట్లు ప్రకటించారు. కొన్ని దేశాలపై తమ ఆంక్షలు ఉన్నాయని, యుద్ధం సద్దుమణిగే వరకు ఆ ఆంక్షలను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. బహుశా మనం వాటిని విధించాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
Trump Russia Oil Sanctions | మూడు దేశాలపై..
రష్యా, ఇరాన్, వెనిజులా చమురు రంగాలపై అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది. చమురు ధరలను తగ్గించే తన ప్రణాళికలలో భాగంగా రష్యాపై ఆంక్షలను సడలించాలని ట్రంప్ పరిశీలిస్తున్నారని తెలిసింది. దీంతో ముడి చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. సోమవారం 120 డాలర్లకు చేరిన బ్యారెల్ క్రూడ్.. మంగళవారం 90 డాలర్లలోపు పడిపోయింది. దీంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Trump Russia Oil Sanctions | ఫోన్లో సంప్రదింపులు
ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో వివాదం గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో తనకు చాలా మంచి సంభాషణ జరిగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వివాదం విషయంలో పుతిన్ సహాయ పడాలనుకుంటున్నారు అని పేర్కొన్నారు. పుతిన్ విదేశాంగ విధాన సహాయకుడు మాట్లాడుతూ, ఇరానియన్ సంఘర్షణకు త్వరిత రాజకీయ, దౌత్యపరమైన ముగింపు కోసం పుతిన్ ఒక ఆలోచనను ప్రతిపాదించారని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు

