అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | ప్రపంచ దేశాలకు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) షాక్ ఇచ్చారు. నిన్నటి వరకు ఇరాన్‌పై బాంబులు వేసిన అమెరికా.. ఇప్పుడు ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే వారిపై టారిఫ్ బాంబు వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టెహ్రాన్ (Tehran)తో రెండు వారాల కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించిన మరుసటి రోజే ట్రంప్ బుధవారం ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటన చేశారు. ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశమైనా, ఎటువంటి మినహాయింపులు లేకుండా తక్షణమే 50 శాతం సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ట్రంప్ గతంలో ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం సుంకాలు విధించాలని యోచిస్తున్నారు.
Trump Tariffs | చైనా లక్ష్యంగా..
ట్రంప్ ముఖ్యంగా చైనా (China) లక్ష్యంగా సుంకాలు విధించనున్నట్లు సమాచారం. బీజింగ్, టెహ్రాన్‌కు డ్రోన్‌లు, విడిభాగాలతో సహా ద్వంద్వ ప్రయోజన వస్తువులను సరఫరా చేస్తోందని అమెరికా భావిస్తోంది. వీటిని ఇరాన్ ప్రభుత్వం తన సైనిక దళాల కోసం ఆయుధాలుగా వాడుకుంటోంది. చైనాలో తయారైన నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసే ఒప్పందాన్ని ఇరాన్ ఖరారు చేసేందుకు దగ్గరగా ఉందని సమాచారం.
Trump Tariffs | చర్చల వేళ
ఓ వైపు ఇరాన్‌తో సీజ్ ఫైర్‌కు అంగీకరించిన ట్రంప్.. మరోవైపు సుంకాలు విధిస్తామని ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇరాన్, అమెరికా రెండు వారాల కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించకుండా టారిఫ్‌లు విధించడంతో చర్చలు ముందుకు సాగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
NEW: A country supplying military weapons to Iran will face 50% tariffs with no exemptions, Trump announces pic.twitter.com/dgzls3ZHgQ
— Faytuks Network (@FaytuksNetwork) April 8, 2026
ఇది కూడా చదవండి : Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ?
