అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UDAN Scheme Expansion | దేశీయ విమానయాన రంగాన్ని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 28,840 కోట్ల బడ్జెట్‌తో ఉడాన్ 2.0 ను ఆమోదించింది.
ఈ పథకం అమలు కోసం పదేళ్ల (2026-27 నుంచి 2035-36 వరకు) కాలానికి రూ. 28,840 కోట్లు నిధులను కేటాయించారు. ఈ నిధులతో కొత్తగా 100 విమానాశ్రయాలను, 200 ఆధునిక హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు. ఇటీవల ప్రధాని మోదీ (Prime Minister Modi) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
UDAN Scheme Expansion | ఎయిర్ కనెక్టివిటీ పెంచాలన్న లక్ష్యంతో..
చిన్న నగరాల నుంచి నేరుగా విమానాలు నడపడం ద్వారా పర్యాటకం, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని, ఎత్తైన పర్వత ప్రాంతాలలో అత్యవసర సేవలు అందించడం సులవవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దేశంలోని రీజనల్ ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకాన్ని తీసుకువచ్చింది. టైర్-2, టైర్-3 నగరాలు, ఎత్తైన ప్రాంతాలు, ద్వీపాలు, ఆస్పిరేషనల్ జిల్లాల్లో విమానయాన సౌకర్యాలను (Aviation facilities) మెరుగుపరచడం. దీని ద్వారా సాధారణ ప్రజలు సరసమైన ధరల్లో విమాన ప్రయాణాలు చేయగలగడానికి అవకాశం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
UDAN Scheme Expansion | 2016లో అమలులోకి..
కేంద్ర ప్రభుత్వం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి 95 విమానాశ్రయాలు/హెలిపోర్టులు కనెక్ట్ అయ్యాయి. 3.41 లక్షలకు పైగా ఫ్లైట్లు నడిచాయి, 162 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీనికి ఇటీవల మార్పులు చేసి ఉడాన్ 2.0 ను తీసుకువచ్చింది.
UDAN Scheme Expansion | రెండో విడతలో..
ఉడాన్ 2.0లో భాగంగా ప్రస్తుతం ఉన్న అన్‌సర్వ్‌డ్ ఎయిర్‌స్ట్రిప్స్ (Unserved Airstrips)ను అప్‌గ్రేడ్ చేసి విమానాశ్రయాలుగా మారుస్తారు. దీనికి సుమారు రూ. 12,159 కోట్లు కేటాయించారు. సగటున ఒక్క విమానాశ్రయానికి రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. వీటిని చాలెంజ్ మోడ్‌లో అభివృద్ధి చేస్తారు. అలాగే పర్వతాలు, దూరప్రాంతాలు, ద్వీపాలు వంటి కష్టమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రయాణాల కోసం 200 ఆధునిక హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. ఒక్కొక్క నిర్మాణానికి సుమారు రూ. 15 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. దీనికోసం రూ. 3,661 కోట్లు కేటాయించారు. ఇవి అత్యవసర సేవలు, ఆరోగ్య సంరక్షణ మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఉపయోగపడనున్నాయి.సామాన్యులకు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలు అందించేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలకు రూ. 10,043 కోట్ల వయేబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) చేయాలనీ నిర్ణయించారు. దీని ద్వారా రిమోట్ రూట్లలోనూ విమానాలు నడపడం సులభం అవుతుందని భావిస్తున్నారు.
UDAN Scheme Expansion | మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత..
మేడ్ ఇన్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా తయారైన చిన్న విమానాలు, హెలికాప్టర్లను (హాల్ ధ్రువ్, డార్నియర్ వంటివి) కొనుగోలు చేసి ఉపయోగించాలని నిర్ణయించారు. ఉడాన్ 2.0 పథకం ద్వారా సుమారు 441 ఎయిర్‌డ్రోమ్‌లకు ఆపరేషనల్ మద్దతు ఇస్తారు.
ఇది కూడా చదవండి..: Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్
