అక్షరటుడే, కామారెడ్డి : Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. గురువారం కామారెడ్డి (Kamareddy) పట్టణ పోలీస్ స్టేషన్లో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్పీ రాజేష్ చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళనం మాత్రమే కాదని, అది మన భారతీయ సంస్కృతి గొప్పదనానికి ప్రతీక అన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, వివిధ అనుభవాలను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి గుర్తు చేస్తుందని వివరించారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నూతన సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
Ugadi Celebrations | ప్రజలతో ఉంటాం
జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సర కాలంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు అందించిన సహకారాన్ని ఎస్పీ గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి పోలీసులు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారని, ప్రజల సంతోషాలను పంచుకోవడమే కాకుండా, కష్టకాలంలో కూడా వారికి వెన్నుముకగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి టౌన్ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Congress Committee Formation | కాంగ్రెస్ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు

