అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ugadi Festival Significance | దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటకలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఉగాది. ఇది తెలుగు ప్రజల పాలిట కొత్త సంవత్సరం. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
Ugadi Festival Significance | ‘ఉగాది’ అనే పదానికి అంతరార్థం:
‘ఉగాది’ అనే పదం ‘యుగ + ఆది’ అనే పదాల కలయిక నుండి పుట్టింది. అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం అని అర్థం. కాలక్రమేణా ‘యుగాది’ కాస్తా ‘ఉగాది’గా మారింది. పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు ఈ రోజే సృష్టిని (యుగాన్ని) ప్రారంభించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజుతోనే తెలుగు సంవత్సరానికి ఒక కొత్త పేరు మొదలవుతుంది.
Ugadi Festival Significance | ఉగాది పండుగ ప్రత్యేకతలు:
నూతన సంవత్సర నామకరణం: తెలుగు క్యాలెండర్ ప్రకారం మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఉగాది రోజు నుంచే ఆ కొత్త ఏడాది పేరు అమలులోకి వస్తుంది. ఈ ఏడాది మనం ‘పరాభవ నామ సంవత్సరంలోకి’ అడుగుపెడుతున్నాము.
పంచాంగ శ్రవణం: ఉగాది రోజున పండితులు జరిపే పంచాంగ శ్రవణం ఎంతో ముఖ్యమైనది. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా కురుస్తాయి? వ్యవసాయం ఎలా ఉంటుంది? దేశ, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? వంటి అంశాలతో పాటు, పన్నెండు రాశుల వారి వ్యక్తిగత ఫలితాలను పండితులు వివరిస్తారు.
షడ్రుచుల ఉగాది పచ్చడి (Ugadi Pachadi): ఈ పండుగలో అత్యంత విశిష్టమైనది ఉగాది పచ్చడి. ఆరు రకాల రుచులతో తయారయ్యే ఈ పచ్చడి, జీవితంలోని ఆరు రకాల అనుభూతులకు ప్రతీక.
ఇళ్ల అలంకరణ, తోరణాలు: ఉగాది నాడు ఇళ్లను రంగురంగుల ముగ్గులతో ముస్తాబు చేస్తారు. గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కడతారు. ఇలా చేయడం వల్ల ఇంటికి సానుకూల శక్తి (Positive Energy) వస్తుందని ప్రజల నమ్మకం.
దైవ దర్శనం, దానధర్మాలు: ఈ పర్వదినాన ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం శుభప్రదం. అలాగే పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు పంచడం వంటి సేవ కార్యక్రమాలు చేయాలని పెద్దలు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!

