అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Iran Talks Twist | పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికా -ఇరాన్ చర్చలకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలపాటు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శుక్రవారం నుంచి పాకిస్థాన్ (Pakistan)లోని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. ఉభయ పక్షాలను వేర్వేరు చోట్ల కూర్చోబెట్టి చర్చలు జరపడం కోసం పాకిస్థాన్‌లో ఏర్పాట్లు కూడా చేశారు.
US Iran Talks Twist | చివరి నిమిషంలో ఇరాన్ ట్విస్ట్
అయితే చివరి నిమిషంలో ఇరాన్ ట్విస్ట్ ఇచ్చింది. లెబనాన్ అంశంపై తేల్చేంత వరకు తాము చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ అమెరికాతో కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ ధ్రువీకరించింది. అమెరికాతో చర్చల కోసం తమ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుందన్న మీడియా రిపోర్ట్‌లలో వాస్తవం లేదని పేర్కొంది.
US Iran Talks Twist | చర్చలలో ప్రతిష్టంభన
లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించబోదని చెబుతూ ఇజ్రాయిల్ భీకర దాడులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. టెహ్రాన్‌కు మద్దతుగా సంఘర్షణలోకి ప్రవేశించిన ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రతరం చేసింది. బుధవారం జరిగిన దాడుల్లో 182 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులను ఇరాన్ ఖండిస్తోంది. ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేసింది. కాల్పుల విరమణ కోసం వాషింగ్టన్‌కు సమర్పించిన తమ 10 సూత్రాల ప్రతిపాదనలో లెబనాన్, ఇజ్రాయిల్‌ల మధ్య సీజ్ ఫైర్ షరతు కూడా ఉందని పేర్కొంటోంది. అయితే ఈ అంశం ఒప్పందంలో చేర్చబడలేదని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Israel PM Benjamin Netanyahu), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంటున్నారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను ఆపితేనే తాము చర్చలకు వస్తామని మెలిక పెట్టడంతో పాకిస్థాన్‌లో అమెరికాతో జరగాల్సిన చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.
ఇది కూడా చదవండి..: US Iran Talks | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేనా?.. నేటి నుంచి అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు
