అక్షరటుడే, వెబ్‌డెస్క్: US War on Iran | మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే 11వ రోజుకు చేరుకున్న ఈ ఘర్షణ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్‌పై మరింత భారీ స్థాయిలో దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతోందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సె్త్ (Pete Hegseth) వెల్లడించారు.
మంగళవారం పెంటగాన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన దాడులకంటే ముందున్న చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపారు. శత్రువును పూర్తిగా ఓడించే వరకు అమెరికా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. గత 24 గంటల్లో ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా తన చర్యలను ఆపదని చెప్పారు. అవసరమైతే మరింత బలంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
US War on Iran | తగ్గేదే లేదు..
ఇక అమెరికా సంయుక్త సైన్యాధిపతుల కమిటీ ఛైర్మన్ డాన్ కెయిన్ (Dan Caine) కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ సైనిక ఆపరేషన్‌లో అమెరికా మరింత బలంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని ఛిద్రం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అక్కడి ప్రజలు డిక్టేటర్‌షిప్ పాలన నుంచి బయటపడే పరిస్థితిని తీసుకురావడం తమ టార్గెట్ అని ఆయన పేర్కొన్నారు.
US War on Iran | ఇరాన్ కీలక నిర్ణయం..
ఇదిలాఉండగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పలు దేశాలపై ఇరాన్ నుంచి క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఖతార్ వైపు దూసుకొచ్చిన ఒక మిస్సైల్‌ను ఆ దేశ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కూడా తమ గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసి ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
US War on Iran | డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz) జలసంధిని మూసివేసింది. దీనిపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌పై దాడులను 20 రెట్లు పెంచుతామని హెచ్చరించారు.అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ కూడా గట్టి సమాధానం ఇచ్చింది. ఇరాన్ భద్రతా వ్యవహారాల అధికారి అలీ మాట్లాడుతూ త్యాగాలకు సిద్ధమైన ఇరాన్ ఎలాంటి బెదిరింపులకు భయపడదన్నారు. మీకంటే పెద్ద శక్తులు కూడా ఇరాన్‌ను కట్టడి చేయలేకపోయాయని, కాబట్టి అమెరికా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Seema Anand Controversy | తెరపైకి సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!

