అక్షరటుడే, హైదరాబాద్ : పూజ, వ్రతం, పెళ్లి ఏ శుభకార్యానికైనా అరటిపండు (Banana) తప్పనిసరి. ఇతర పండ్లు ఎన్ని ఉన్నా, భగవంతుడికి నివేదించే వాటిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్ని కాలాల్లో లభించే ఈ పండును శుభసూచకంగా, పవిత్రంగా భావిస్తారు. ఇంతకీ మన సంప్రదాయంలో అరటిపండుకు ఎందుకంత ప్రాధాన్యత లభించింది? ఆ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Banana | అరటిపండు విశిష్టత, పూర్ణఫలం వెనుక రహస్యం:
సాధారణంగా మనం పండ్లను తిన్నప్పుడు వాటి గింజలను పారేస్తాం (ఉదాహరణకు సపోటా, సీతాఫలం). పారేసిన ఆ గింజల నుంచే మళ్లీ చెట్లు మొలకెత్తి, తిరిగి పండ్లను ఇస్తాయి. అంటే, ఆ గింజలను ఎంగిలి పడిన వాటిగా భావించవచ్చు. అలాంటి పండ్లను కూడా మనం దేవుడికి సమర్పిస్తాం. కానీ అరటిపండు విషయంలో అలా జరగదు.
గింజలు లేకపోవడం : అరటిపండును పూర్తిగా తినేస్తాం కాబట్టి, పారేయడానికి విత్తనాలు (Seeds) అంటూ ఏమీ ఉండవు. అందువల్ల ఇది ఎంగిలి కాని ఫలమని భావిస్తారు.
వృద్ధి విధానం : అరటి తోటలు పిలక మొక్కల (వేరు నుంచి వచ్చే చిన్న మొక్కలు) ద్వారా మాత్రమే వృద్ధి చెందుతాయి, విత్తనాల ద్వారా కాదు.
పూర్ణఫలం : ఈ కారణం చేతనే అరటిపండును అత్యంత పవిత్రమైనదిగా, పూర్ణఫలంగా (సంపూర్ణమైన ఫలం) పెద్దలు భావించి దేవుడికి నివేదించడం శ్రేయస్కరమని చెప్తారు.
Banana | అరటిచెట్టులోని ప్రతి భాగం పవిత్రమే:
అరటిచెట్టు (Banana Tree) కేవలం పండ్లనే కాదు, తనలోని ప్రతి భాగాన్ని పవిత్ర కార్యాలకు అందిస్తుంది.
ఆకులు : శుభకార్యాల్లో విస్తరాకులు (Banana Leafes) గా, పూజకు అలంకరణగా ఉపయోగిస్తారు.
కాండం లేదా దూట : మండపాలు, ద్వారాలు అలంకరించడానికి ఉపయోగిస్తారు.
తక్కువ కాలంలో ఫలం : ఈ చెట్టు అతి తక్కువ కాలంలోనే ఫలాలను అందించడం కూడా దీని విశిష్టతకు ఒక కారణంగా చెప్పవచ్చు.
అందుకే, అరటిపండును దేవుడికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, తాంబూలంలో అరటిపండ్లను చేర్చడం పుణ్యప్రదంగా మన సంప్రదాయాలు చెప్తున్నాయి.


