అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Women Empowerment | మహిళలకు అవకాశాలు ఇవ్వడం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతామని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు.
Women Empowerment | గివ్ టు గైన్ అనే నినాదంతో..
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా 2026లో ‘గివ్ టు గైన్’ అన్న నినాదాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. మహిళలకు సమాన అవకాశాలను ఇచ్చినట్లయితే వారు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తారని తెలిపారు. మహిళా సాధికారత సాధించడంలో లింగ విభేదాన్ని విడనాడాలన్నారు. ‘గివ్ టు గైన్’ అన్న నినాదాన్ని సార్థకత చేసుకుంటూ సమాజంలోని ప్రతిఒక్కరూ మహిళా సాధికారతకు పాటుపడదామని పిలుపునిచ్చారు.
Women Empowerment | మహిళాభివృద్ధికి చదువే మూలం..
మహిళలు తమ కుటుంబాల అభివృద్ధికి చదువే మూలం అని గ్రహించాలని సీతక్క పేర్కొన్నారు. మహిళా అభ్యున్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని అన్నారు. చదువు విజ్ఞానాన్ని ఇస్తుందని ఈ విజ్ఞానంతో సమాజంలో రాణిస్తామని అన్నారు.
ప్రతి విద్యార్థిని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయాలన్నారు. ప్రతి మహిళ కమిట్మెంట్, అండ్ కరేజ్ను కలిగి ఉండాలని, ఛాలెంజ్ లేని జీవితం చప్పటి కూర లాంటిదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా నేను నా జీవితాన్ని గొప్పస్థాయిలో మలుచుకోగలిగానన్నారు. పదోతరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన నేను ఒక నక్సలైట్‌గా ఏ కోర్టులో నిలుచున్నానో అదే కోర్టులో నేను అడ్వకేట్‌గా నిలిచి అదే కోర్టులో వాదించానన్నారు.
Women Empowerment
Women Empowerment | సమస్యలను అధిగమిస్తూ..
మహిళగా సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే సమస్యలను అధిగమించేలా ఉండాలని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మంత్రి అన్నారు. చదువు, క్రమశిక్షణతో మనం మనంగా నిరూపించుకోవాలని అది చదివైనా, పని అయినా ఏ రంగంలోనైనా మనంగా నిరూపించబడాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 15ఏళ్లు నిండిన ప్రతి మహిళకు మహిళా సంఘాలలో సభ్యత్వాలను కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Women Empowerment | సమాజం దారితప్పకుండా ఉండేందుకు..
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఛైర్మన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ సమాజంలోని మహిళల విజయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. డ్రగ్స్ వంటి మహమ్మారిపై అవగాహన కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ కె.ఉమారాణి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ డీసీపీ(అడ్మిన్) జి.బస్వా రెడ్డి, ట్రెజరర్ కె.సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవితారెడ్డి, ఎన్ఎస్పీ సభ్యులు కాకతీయ కళాశాల అధినేత రజినీకాంత్, కామారెడ్డి సబ్ డివిజన్ ఏసీపీ చైతన్య రెడ్డి (ACP Chaitanya Reddy) , కామారెడ్డి డీఎఫ్‌వో నిఖిత, నుడా ఛైర్మన్ కేశ వేణు, వివిధ కళాశాలకు చెందిన విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..


