అక్షరటుడే, వెబ్డెస్క్ : Women Reservation Bill | చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృ శక్తి, నారీ శక్తిని దేశాభివృద్ధిలో భాగం చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమన్నారు.
మహిళా రిజర్వేషన్ల (Women’s Reservations) చట్టానికి ప్రతిపాదించిన సవరణలు ఒక శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదని, అవి భారతదేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధానమంత్రి గురువారం పేర్కొన్నారు. ఈ చర్యకు మద్దతు తెలిపేందుకు పార్లమెంటు సభ్యులందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 2029 లోక్‌సభ ఎన్నికలు, రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మహిళ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.
Women Reservation Bill | 16న పార్లమెంట్ సమావేశం
మహిళా రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ఒక కీలకమైన బిల్లుపై చర్చించి, దానిని ఆమోదించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమావేశమవుతుందని ప్రధాన తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో, ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ల చట్టం)కు సవరణలు చేయనున్నారు. 2029 సాధారణ ఎన్నికల నుంచే దీనిని అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Women Reservation Bill | మహిళలకు 273 ఎంపీ స్థానాలు
చట్ట సవరణ అనంతరం లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు పెరుగుతుంది. ఇందులో 273 స్థానాలు మహిళల కోసం రిజర్వు చేస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నిబంధనను 2023లో రాజ్యాంగానికి సవరణ చేయడం ద్వారా తీసుకువచ్చారు. 2027 జనాభా లెక్కల ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇది అమలులోకి వస్తుంది. ప్రస్తుత చట్టం యథాతథంగా కొనసాగితే ఈ నిబంధన 2034లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో తాజాగా ఆ చట్టానికి సవరణ చేయనున్నట్లు మోదీ తెలిపారు. 2027 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి..: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
