అక్షరటుడే, వెబ్‌డెస్క్: Women Stomach Pain | సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం సహజం. అయితే కేవలం పీరియడ్స్ సమయంలోనే కాకుండా, ఇతర సమయాల్లో కూడా అడపాదడపా ఈ నొప్పి వేధిస్తుంటే దానిని అస్సలు అశ్రద్ధ చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది ఒక చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే, అది భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. నొప్పి వచ్చే స్థానాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన ఇబ్బందో గుర్తించవచ్చు.
Women Stomach Pain | నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి ఆరోగ్య సమస్యలు:
మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI): నొప్పి మూత్రనాళంలో మొదలై పొత్తికడుపు కింది భాగం వరకు చేరుకుంటే, దానిని మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు (UTI) సూచనగా భావించాలి. కడుపు నొప్పితో పాటు మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, నొప్పి రావడం వంటివి ప్రధాన లక్షణాలు.
కొంతమందిలో మూత్రంతో పాటు రక్తం కూడా పడుతుంటుంది. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే, ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మూత్ర వ్యవస్థలో ఏర్పడే కణితుల వల్ల కూడా ఇలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టరును సంప్రదించి మూత్ర పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
Women Stomach Pain | పొత్తికడుపు మధ్యభాగంలో నొప్పి:
చాలామంది మహిళలకు పొత్తికడుపు మధ్య భాగంలో నొప్పి వస్తుంటుంది. ఇలా జరిగితే గర్భాశయం, అండాశయాలు (Ovaries) లేదా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఏదో ఒక చోట ఇబ్బంది ఉన్నట్లు గుర్తించాలి.
ఇది ఎండోమెట్రియోసిస్, గర్భాశయ ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ లేదా అండాశయాల్లో సిస్టులు (Cysts) వంటి సమస్యలకు సంకేతం కావచ్చు. తరచుగా పొత్తికడుపు మధ్యలో నొప్పి వేధిస్తుంటే నిపుణుల సలహా మేరకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
బొడ్డు దగ్గర నొప్పి మొదలైతే:
కొన్ని సందర్భాల్లో నొప్పి బొడ్డు భాగం దగ్గర మొదలై పైకి ఛాతీ వరకు పాకుతుంది. దీనితో పాటు కడుపులో మంటగా అనిపిస్తే అది ‘పెప్టిక్ అల్సర్’ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల ఆకలి తగ్గడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
కటి భాగంలో నొప్పి:
కొంతమంది స్త్రీలలో నడుము కింది భాగం లేదా కటి ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది. నొప్పి తీవ్రత తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. ఒకవేళ ఈ నొప్పి మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగితే, దానిని ‘పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్’గా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

