అక్షరటుడే, వెబ్డెస్క్: World TB Day | మానవాళిని వేధిస్తున్న ప్రమాదకర వ్యాధుల్లో క్షయ (టీబీ) కూడా ఒకటి. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియం వల్ల వస్తుంది. ఇది ఒక తీవ్రమైన అంటు వ్యాధి. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఇది ప్రభావితం చేస్తుంది. అనంతరం క్రమంగా మూత్రపిండాలు, మెదడు వంటి ఇతర భాగాలను సైతం దెబ్బతీస్తుంది. వరల్డ్ ట్యుబర్క్యులోసిస్ డే (World TB Day) నేపథ్యంలో.. అసలు టీబీ ఎందుకు వస్తుంది, లక్షణాలు, ట్రీట్‌మెంట్, ఇతర వివరాలను డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ‘అక్షరటుడే’ ద్వారా వివరించారు.
World TB Day | ఎలా సోకుతుంది..
టీబీ అనేది అంటు వ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలో సూక్ష్మ కణాలు విడుదలవుతాయి. ఈ కణాలను ఇతరులు ఊపిరి పీల్చినప్పుడు వ్యాధి సోకే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతియేటా మార్చి 24న ‘ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. 1882లో ఇదే రోజున డాక్టర్ రాబర్ట్ కోచ్.. మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ను కనుగొన్నారు. దీంతో ఈ రోజు నాడు వరల్డ్ ట్యుబర్క్యులోసిస్ డే జరుపుతున్నారు.
World TB Day | లక్షల మంది బాధితులు
క్షయ వ్యాధితో (టీబీ) ప్రపంచవ్యాప్తంగా లక్షలది మంది బాధపడుతున్నారు. వ్యాధి సోకిన వ్యక్తి ఆరోగ్యాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే సరైన అవగాహన, త్వరితగతిన గుర్తింపు, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు.
క్షయ వ్యాధి కారణాలు
క్షయ వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలో చిన్నచిన్న సూక్ష్మ కణాలు విడుదలవుతాయి. కణాలను ఇతరులు పీల్చినప్పుడు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
క్షయ వ్యాధి కారకాలు
• రోగనిరోధక శక్తి బలహీనపడడం
• పోషకాహార లోపం
• మధుమేహం (డయాబెటిస్)
• ధూమపానం, మద్యపానం
• క్షయ బాధితులతో సన్నిహిత సంబంధాలు ఉండడం
క్షయ వ్యాధి లక్షణాలు
• రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతర దగ్గు ఉంటుంది.
• దగ్గులో రక్తం కలిసి రావడం జరుగుతుంది.
• సాయంత్రం వేళల్లో వచ్చే జ్వరం వస్తుంది.
• రాత్రి సమయంలో అధిక చెమటలు పడతాయి.
• శరీర బరువు తగ్గిపోవడం జరుగుతుంది.
• అలసట, ఆకలి లేకపోవడం లక్షణాలు కనిపిస్తాయి.
క్షయ వ్యాధి నిర్ధారణ
క్షయ వ్యాధిని గుర్తించడానికి వైద్యులు కొన్ని అత్యాధునిక పరీక్షలను సూచిస్తారు. వీటిలో కఫం పరీక్ష (స్పుటం టెస్ట్), ఛాతీ ఎక్స్-రే, CBNAAT వంటి ఆధునిక మాలిక్యులర్ పరీక్షలు, బ్రాంకోస్కోపీ, థొరాకోస్కోపీ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఒకవేళ క్షయ వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగితే సకాలంలో చికిత్స పొందడం వల్ల పూర్తిగా నయం అవుతుంది.
చికిత్స పద్ధతులు
క్షయ వ్యాధికి చికిత్స తీసుకోవడం వల్ల పూర్తిగా నయం అవుతుంది. సాధారణంగా 6 నుంచి 9 నెలల వరకు డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం మందుల కోర్సును పూర్తి చేయాలి. మధ్యలో ఆపేస్తే వ్యాధి మళ్లీ తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి నుంచి బయట పడొచ్చు.
ఇది కూడా చదవండి..: Home Cleaning Tips | ఇంట్లో వీటిని శుభ్రం చేయడం లేదా.. అయితే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే!

