అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yuvraj Apology Dhoni Kapil Dev | భారత క్రికెట్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, టీమిండియా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ (MS Dhoni), కపిల్ దేవ్‌లకు క్షమాపణలు తెలిపారు.
ఓ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్ టీజర్‌లో యువరాజ్ మాట్లాడుతూ.. “నేను కపిల్ దేవ్ (Kapil Dev) గారికి, ఎంఎస్ ధోనీకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశారు. తన తండ్రి తరచూ ఇచ్చే ఇంటర్వ్యూల గురించి ప్రస్తావిస్తూ, “నాన్నా.. అది సరైంది కాదు అని చెప్పాను” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Yuvraj Apology Dhoni Kapil Dev | వివాదాలకు కేంద్రబిందువైన యోగ్‌రాజ్ వ్యాఖ్యలు
యోగ్‌రాజ్ సింగ్ గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు చేస్తూ, తన కుమారుడు కెప్టెన్ అవ్వకుండా ధోనీ అడ్డుకున్నాడని ఆరోపించారు. యువరాజ్ కెరీర్‌ను కూడా ధోనీ కారణంగా దెబ్బతిన్నదని పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే వాస్తవానికి, ధోనీ నాయకత్వంలోనే యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో అతని పాత్ర చారిత్రాత్మకంగా నిలిచింది. ఇక కపిల్ దేవ్‌పై కూడా యోగ్‌రాజ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. 1980లలో తనను జట్టులోనుంచి తప్పించినందుకు కోపంతో కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానని, ఆయుధంతో ఆయన ఇంటివరకు వెళ్లానని చెప్పడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది.
Yuvraj Apology Dhoni Kapil Dev | ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తన తండ్రి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని స్పష్టంగా తెలిపారు. పెద్దల పట్ల గౌరవం చూపుతూ క్షమాపణలు చెప్పడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. క్రీడా రంగంలో లెజెండ్స్‌గా నిలిచిన ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌లపై వచ్చిన వివాదాల మధ్య, యువరాజ్ సింగ్ స్పందన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. వ్యక్తిగత అభిప్రాయాలకంటే గౌరవం ముఖ్యమని యువీ చెప్పకనే చెప్పాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీ, కపిల్ దేవ్, యువరాజ్ సింగ్ ముగ్గురూ దిగ్గజాలే కాగా, యోగ్‌రాజ్ చేసిన వ్యక్తిగత విమర్శల వల్ల వారి మధ్య ఉన్న గౌరవం దెబ్బతినకూడదని యువీ భావించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Nitish Kumar Reddy | నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే కమ్‌బ్యాక్.. నా మైండ్ నిండా నెగెటివ్ ఆలోచనలే ఉండేవంటూ కామెంట్
