అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vinod Kambli Health | భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్యం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నడవగలుగుతున్నప్పటికీ, జ్ఞాపకశక్తి బలహీనంగా ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా క్రికెట్ వర్గాలు పెద్దఎత్తున ముందుకు వచ్చాయి. కాంబ్లీకి ఆర్థికంగా సహాయం అందించేందుకు మాజీ క్రికెటర్లు ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన స్నేహితుడు మార్కస్ కౌటో తెలిపారు. ఈ సహాయక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ కూడా భాగమయ్యారు. అలాగే క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), కపిల్ దేవ్ (Kapil Dev) వంటి వారు కూడా కాంబ్లీ పునరావాసానికి మద్దతు అందిస్తున్నారు.
Vinod Kambli Health | రక్తం గడ్డ కట్టడంతో..
మార్కస్ కౌటో వివరాల ప్రకారం, కాంబ్లీ ఆరోగ్యం గత కొన్ని నెలల్లో మరింత క్షీణించకపోయినా, జ్ఞాపకశక్తి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనకు విషయాలు ముక్కలుగా మాత్రమే గుర్తుకు వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో పూర్తిగా మర్చిపోతున్నారని తెలిపారు. మద్యం సేవించడం మానేసినప్పటికీ, పొగ తాగకూడదనే విషయాన్ని కూడా కొన్నిసార్లు మర్చిపోతున్నారని చెప్పారు. కాంబ్లీ మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చికిత్స మరింత క్లిష్టమైందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Vinod Kambli Health | ఇంకా సమయం పట్టే అవకాశం
సుమారు ఏడాది క్రితం థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి (Private Hospital)లో మూత్రనాళ ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందిన అనంతరం ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. అయితే పూర్తిస్థాయి ఆరోగ్యం సాధించడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. ఇక 18 నెలల క్రితం ముంబైలో జరిగిన కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కాంబ్లీ కనిపించినప్పుడు ఆయన పరిస్థితి అభిమానులను కలవరపరిచింది. అప్పుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) చేతిని పట్టుకుని నడవడం, నిలబడటానికి ఇబ్బంది పడడం గమనార్హం. ప్రస్తుతం కాంబ్లీ కోలుకునే దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: KKR IPL 2026 Failure | ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ పతనం.. రూ.25 కోట్ల స్టార్ ఫ్లాప్, ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి
