అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ambedkar Jayanti Nizamabad | భారతరత్న అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే దేశంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. రాజ్యంగంలో ఆలిండియా సర్వీసెస్ గురించి పొందుపర్చిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగానని గుర్తు చేశారు.
జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Ambedkar Jayanti Nizamabad | రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..
అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల వారు అభ్యున్నతి సాధించాలని అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్బోధించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతిఒక్కరూ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ, ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు బాబా సాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Ambedkar Jayanti Nizamabad | ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చు..
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్య కోసం తోడ్పాటును అందిస్తోందని కలెక్టర్ అన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ.లక్షకు పైగా నిధులను ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలని మార్గనిర్దేశం చేశారు. నగరంలో అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అందరితో చర్చించి జిల్లా యంత్రాంగం సముచిత నిర్ణయం తీసుకుంటుందన్నారు. నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సమాజంలో ప్రతిఒక్కరూ హక్కులు, బాధ్యతలను, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు.
Ambedkar Jayanti Nizamabad | అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి
రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని అన్నారు. సమాన విద్య, సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపర్చినవే అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీటీసీ దుర్గా ప్రమీల, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజగంగారాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
