అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Delimitation Warning | డీలిమిటేషన్ (Delimitation)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగా మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మూడేళ్లుగా ఈ విషయంలో బీఆర్ఎస్ (BRS) వైఖరిలో మార్పు లేదన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగకుండా చూడాలన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.
KTR Delimitation Warning | విద్యార్థిని మృతి బాధాకారం
కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మృతిపై కేటీఆర్ స్పందించారు. ఈ బాధాకరమైన సంఘటనకు పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)దే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థను, గురుకులాలను, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితి వల్ల అమాయక విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 140 మందికి పైగా పిల్లలు సర్కారు నిర్వాకంతో కన్నుమూసినా ముఖ్యమంత్రిలో కనీస చలనం లేదన్నారు. శ్రావణి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త
