అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lung Cancer | సాధారణంగా క్యాన్సర్ అంటే ముదిరిన తర్వాతే బయటపడుతుందని చాలామంది భావిస్తారు. కానీ, మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను గమనిస్తే ఈ ప్రాణాంతక వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో మన చేతి వేళ్లు, గోళ్లు ఇచ్చే సూచనలు అత్యంత కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Lung Cancer | ‘క్లబ్బింగ్’ అంటే..
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు మన గోళ్లలోనే కనిపిస్తాయి. దీనిని వైద్య పరిభాషలో ‘క్లబ్బింగ్’ అని పిలుస్తారు. ఇందులో వేళ్ల చివరలు మందంగా మారి, గోళ్లు ఉబ్బిపోయినట్లు కనిపిస్తాయి. గోరు ఆకారం కొద్దిగా వంకరగా లేదా గుండ్రంగా మారడం దీని ప్రధాన లక్షణం.
గోళ్ల రంగులో మార్పులు: శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల గోళ్లు పాలిపోయినట్లుగా లేదా నీలి రంగులోకి మారుతుంటాయి. అంతేకాకుండా, గోళ్ల అడుగు భాగం మెత్తగా మారి, వేళ్ల చివరలు ఉబ్బినట్లు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఇతర సాధారణ లక్షణాలు: గోళ్లలో మార్పులతో పాటు ఈ క్రింది లక్షణాలను కూడా గమనించాలి.
ఎన్ని మందులు వాడినా తగ్గని దగ్గు, నడిచినా లేదా చిన్నపాటి పని చేసినా ఆయాసం రావడం, శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గేటప్పుడు ఛాతిలో విపరీతమైన నొప్పి, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట, వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Lung Cancer | భారత్‌లో పెరుగుతున్న ముప్పు:
ఇటీవల కాలంలో యువతలో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ‘ది లాన్సెట్’ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్యలో భారత్ మూడవ స్థానంలో ఉంది. ఐసీఎంఆర్ (ICMR) గణాంకాల ప్రకారం, మన దేశంలో ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యాధిని ముదిరిన తర్వాత గుర్తించడమే.
క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో, ముఖ్యంగా వేళ్లు , గోళ్లలో ఎటువంటి అసాధారణ మార్పులు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి: Vastu Tortoise | ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే అదృష్టమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి?
