అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gautam Adani | అంతర్జాతీయంగా కొంతకాలంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ (Stock Market) తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. దీంతో కుబేరుల సంపదా తగ్గిపోయింది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీలు రాణిస్తున్నాయి. ప్రధానంగా అదానీ గ్రూప్ స్టాక్స్ రాణించాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం భారత్‌తో పాటుగా ఆసియాలో కూడా అత్యంత ధనవంతుడిగా ఆయన నిలిచారు. మరోవైపు ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ స్టాక్స్ పనితీరు నిరాశ పరిచింది. దీంతో ఆ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయి ముఖేశ్ అంబానీ సంపద కూడా తగ్గింది. దీంతో చాలాకాలంగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) రెండో స్థానానికి పడిపోయారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది.
Gautam Adani | ఎవరి సంపద ఎంతంటే..
ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ రిచ్ లిస్ట్ ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 92.6 బిలియన్ డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ. 8.60 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 20వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 90.8 బిలియన్ డాలర్లు. ఇది మనదేశ కరెన్సీలో రూ. 8.43 లక్షల కోట్లు. స్టాక్ ధరలు, వ్యాపార పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
Gautam Adani | ప్రపంచ నంబర్ వన్ మస్కే..
ప్రపంచ కుబేరుల జాబితాలో నంబర్ వన్‌గా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 656 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. రెండో స్థానంలో ల్యారీ పేజ్ (286 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో జెఫ్ బెజోస్ (269 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో సెర్గే బ్రిన్ (266 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో మార్గ్ జుకర్‌బర్గ్ (239 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో ల్యారీ ఎల్లిసన్ (230 బిలియన్ డాలర్లు), ఏడో స్థానంలో మిచెల్ డెల్ (170 బిలియన్ డాలర్లు), ఎనిమిదో స్థానంలో జెన్‌సెన్ హువాంగ్ (164 బిలియన్ డాలర్లు), తొమ్మిదో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (164 బిలియన్ డాలర్లు), పదో స్థానంలో జిమ్ వాల్టన్ (150 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
Gautam Adani | భారత్‌లో టాప్ టెన్ సంపన్నులు..
భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో లక్ష్మీ మిట్టల్ (36.9 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో శివ్ నాడార్ (33.5 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో షాపూర్ మిస్త్రీ (33.2 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో సావిత్రి జిందాల్ (32.7 బిలియన్ డాలర్లు), ఏడో స్థానంలో సునిల్ మిట్టల్(25.1 బిలియన్ డాలర్లు), ఎనిమిదో స్థానంలో దిలిప్ శాంగ్వి (24.2 బిలియన్ డాలర్లు), తొమ్మిదో స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ (22.5 బిలియన్ డాలర్లు), పదో స్థానంలో కుమార మంగళం బిర్లా (22.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్ గాంధీ
