అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pudi Srihari Arrest | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొల్పే పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరినుపోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేయించారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లు చూపించిన యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఫిర్యాదులపై చిత్తూరు జిల్లాలో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Pudi Srihari Arrest | వేడెక్కిన రాజకీయం..
ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయం తాడేపల్లి (Tadepalli)లోని పూడి శ్రీహరి నివాసానికి చేరుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వినియోగిస్తున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) స్పందించింది. కనీసం కేసు వివరాలు వెల్లడించకుండా పోలీసులు వ్యవహరించారని పార్టీ ఆరోపించింది. తాడేపల్లిలో సోదాలు నిర్వహించి, ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా శ్రీహరిని తీసుకెళ్లడం దురుద్దేశపూరిత చర్యగా పేర్కొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, కుప్పం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల పేరుతో చిత్తూరు 2 టౌన్ సీఐ పూడి శ్రీహరిని దౌర్జన్యంగా తీసుకెళ్లారని విమర్శించారు. ఈ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు.
పూడి శ్రీహరి ( Pudi Srihari Arrest) గతంలో పలు మీడియా సంస్థల్లో పనిచేసి, 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) పాదయాత్ర సమయంలో కీలక పాత్ర పోషించారు. మీడియా వ్యూహాలను సమర్థంగా నిర్వహించి పార్టీకి మద్దతు సమీకరించారు. ఆయన ‘అడుగడుగునా అంతరంగం’ పేరుతో పాదయాత్రపై పుస్తకాన్ని కూడా రచించారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు సీపీఆర్‌వోగా కీలక బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పెంచింది.
ఇది కూడా చదవండి..: AP Inter Results | ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
