అక్షరటుడే, వెబ్డెస్క్: Ramavath Madhu Arrest | సైబరాబాద్‌లో మైక్రో ఫైనాన్స్–రియల్ ఎస్టేట్ మోసం కేసులో కీలక అప్డేట్ చోటుచేసుకుంది. “శుభక్షేత్ర” పేరుతో పెట్టుబడిదారులను ఆకర్షించి భారీగా డబ్బులు సేకరించిన కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Ramavath Madhu Arrest | ప్లాట్లు ఇస్తామని
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ మోసంలో హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సత్యనారాయణ చౌదరి ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరు పటాన్‌చెరు–దామరగిద్ద ప్రాంతాల్లో వెంచర్ పేరుతో ప్లాట్లు ఇస్తామని చెప్పి పెట్టుబడిదారులను మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నిందితులు 102 స్క్వేర్ యార్డుల ప్లాట్ ఇస్తామని హామీ ఇచ్చి, నెలకు ₹25,000 చొప్పున 42 నెలలు చెల్లిస్తామని ప్రలోభపెట్టారు. అదనంగా ₹5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పి బాధితులను ఆకర్షించారు. ఈ విధంగా మొత్తం 33 మంది నుంచి భారీగా డబ్బులు సేకరించినట్టు పోలీసులు తెలిపారు.
Ramavath Madhu Arrest | ఒప్పందాల పేరుతో కాలయాపన
అయితే, డబ్బులు సేకరించిన తర్వాత ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయకుండా ఒప్పందాల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చినట్టు ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్ EOW పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(2)తో పాటు TSPDFEA చట్టంలోని సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
