అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Delimitation | మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని తెలిపారు. అయితే ఈ రెండు అంశాలను కలిపి బీజేపీ (BJP) కావాలనే రాజకీయం చేస్తోందని విమర్శించారు.
Revanth Reddy Delimitation | రెండూ కీలక అంశాలే..
మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బీజేపీ మాత్రం తమ సొంత వ్యవహారంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ (Congress) వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
Revanth Reddy Delimitation | సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే..
మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్సే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ కేంద్రం దేశ వ్యాప్తంగా కుట్రపూరితంగా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు కలుపుతున్నారని ఆరోపించారు. ఇందులో రాజకీయ కుట్ర, వివక్ష కలిసి ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Revanth Reddy Delimitation | మహిళా రిజర్వేషన్లు బిల్లుకు మద్దతు
మహిళా రిజర్వేషన్లు బిల్లుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఉన్న సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయాలన్నారు. కానీ ఎన్డీయే 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఆరు నెలల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
Revanth Reddy Delimitation | ప్రమాదకర దిశలో డీలిమిటేషన్
డీలిమిటేషన్ ప్రక్రియ ప్రమాదకర దిశలో వెళ్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోదీ (Modi) చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయన్నారు. ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరగకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. దీంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి..: DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
